టీడీపీ నేతలను ఎప్పుడు పడితే అప్పుడు అరెస్టు చేయడం, స్టేషన్లకు తరలించడం వంటి ఘటనలపై కోర్టులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినా సరే వారి తీరు మారడం లేదనడానికి తాజా ఘటనే నిదర్శనం. తాజాగా టీడీపీ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌కు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులివ్వడం కలకలం రేపిందది.
హైదరాబాద్ లోని విజయ్ ఇంటికి శనివారంనాడు ఏపీ సీఐడీ పోలీసులు వెళ్లగా..ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. దీంతో, ఆయన పిల్లలను ప్రశ్నించిన పోలీసులు… అనంతరం విజయ్ ఇంటి పనిమనిషికి 41 సీఆర్పీసీ ప్రకారం నోటీసులు అందజేశారు. ఈ నెల 6న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో సైబర్ క్రైమ్ విభాగంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకవేళ, విచారణకు హాజరుకాకపోతే 41 ఏ (3), (4) సీఆర్పీసీ సెక్షన్ ప్రకారం అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై విజయ్ పై నమోదైన కేసులో భాగంగా విజయ్ కు నోటీసులు అందించారు.
అయతే, విజయ్ ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ దురుసుగా వ్యవహరించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. విజయ్ ఇంటిలో పనిచేసే వారిపై పోలీసులు బెదిరింపులకు దిగారని ఆయన ఆరోపించారు. విజయ్ ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. హైకోర్టు ఎన్ని సార్లు మందలించినా జగన్ సర్కారుకు బుద్ధి రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షసాధింపుల కోసం ఏపీ పోలీసులను జగన్ వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.
బీసీ నేత అయ్యన్న గారి కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నేరాలు – ఘోరాలు చేస్తున్న వైసిపి నేతలకు సన్మానాలు చేసి పదవులు కట్ట బెడుతుంది ప్రభుత్వం అని మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న టిడిపి నేతల పై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు జగన్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. అయన్నపాత్రుడు గారి కుటుంబాన్ని టచ్ చేసిన ఏ ఒక్కరిని వదిలి పెట్టం అని, వైసిపి అధికార మదాన్ని అణిచివేస్తామని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు.