‘‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’’ పృథ్వీరాజ్…ఇరు తెలుగు రాష్ట్రాలలో పృథ్వీరాజ్ కు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లోని ప్రముఖ కమెడియన్లలో ఒకరిగా కొనసాగుతున్న పృథ్వీరాజ్…రాజకీయాల్లోనూ వైసీపీ నేతగా కొంతకాలం కొనసాగారు. అయితే, ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి పృథ్వీరాజ్ ను జగన్ తొలగించినప్పటినుంచి ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఈ క్రమంలోనే వైసీపీకి గుడ్ బై చెప్పిన పృథ్వీరాజ్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
అయినా సరే, ఇటు పొలిటికల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ లోను పృథ్వీరాజ్ కు ఆ బ్యాడ్ టైం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలోని ఫ్యామిలీ కోర్టు పృథ్వీరాజ్ కు షాక్ ఇచ్చింది. తన భార్య శ్రీలక్ష్మికి నెలకు 8 లక్షల రూపాయల భరణం చెల్లించాలని న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. 1984లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ అలియాస్ శేషుకు, విజయవాడకు చెందిన శ్రీలక్ష్మితో వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 2016లో మనస్పర్థల వల్ల తనను పృథ్వీ ఇంటి నుంచి గెంటేశారని శ్రీలక్ష్మి కోర్టులో కేసు వేశారు.
అంతేకాదు, పెళ్లైన కొత్తలో చెన్నైలో సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తున్న పృథ్వీరాజ్ తమ ఇంటి నుంచే అక్కడికి వెళ్లి వచ్చేవారని శ్రీలక్ష్మి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ సమయంలో పృథ్వీ ఖర్చులన్నీ తన తల్లిదండ్రులు భరించారని అన్నారు. 2016లో పృథ్వీరాజ్ ఇంటి నుంచి వెళ్లగొట్టారని అప్పటినుంచి తాను గత్యంతరం లేక పుట్టింట్లోనే ఉంటున్నానని శ్రీలక్ష్మి వెల్లడించారు.
ఈ క్రమంలోనే 2017లో పృధ్విరాజ్ నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరుతూ విజయవాడ ఫ్యామిలీ కోర్టును శ్రీలక్ష్మి ఆశ్రయించారు. దీంతో, ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు కీలకతీర్పును వెలువరించింది. శ్రీలక్ష్మికి పృథ్వీరాజ్ నెలకు 8 లక్షల భరణం చెల్లించాలని, 2017 నుంచి ఇప్పటివరకు మొత్తం డబ్బు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, పృథ్వీకి షాక్ తగిలినట్లయింది.