తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు..సీఎం వైఎస్ జగన్ కు అనుకూలంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే, అనూహ్యంగా తాజాగా జగన్ చేసిన తిరుమల పర్యటనపై ఆయన విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ తిరుమల పర్యటన తనను నిరాశకు గురి చేసిందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.
టీటీడీలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఆయన ఆరోపించడం వివాదాస్పదంగా మారింది. వంశపారంపర్య అర్చక వ్యవస్థకు సంబంధించిన నివేదికపై జగన్ స్పందిస్తారని ఆశించామని, కానీ, జగన్ స్పందించలేదని రమణ దీక్షితులు నిరాశ చెందారట. అర్చక వ్యవస్థను టీటీడీ నాశనం చేసేలోపే జగన్ స్పందించాలని, వంశపారంపర్య అర్చక వ్యవస్థపై కమిటీ సిఫారసులను అమలు చేయాలని రమణ దీక్షితులు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
అయితే, రమణ దీక్షితులు వ్యాఖ్యలపై తిరుమల అర్చకులు మండిపడుతున్నారు. రమణ దీక్షితులు స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. ఆ కమిటీ సిఫారసు చేసిన అంశాలేమిటో ఎవరికీ తెలియవని, బయటి విషయాలను తాము పట్టించుకోవడం లేదని చెప్పారు. స్వామి వారి కైంకర్యాలను వైభవంగా నిర్వహిస్తున్నామని, ఆ విషయంలో తమకు ఎలాంటి అవరోధాలు ఎదురుకావడం లేదని వెల్లడించారు.
తిరుమలలో అర్చక వ్యవస్థ సంతృప్తికరంగానే ఉందని, అర్చకులను 112 సెక్షన్ ప్రకారం క్రమబద్ధీకరించారని తెలిపారు. తమ పిల్లలకు కూడా శ్రీవారి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించారని చెప్పారు. కమిటీ నివేదిక ప్రకారం మిరాశీలను ఉద్యోగులుగా తీసుకున్నారని, నిబంధనల ప్రకారం తమకు గౌరవ మర్యాదలు దక్కుతున్నాయని అర్చకులు వెల్లడించారు. దీంతో, రమణ దీక్షితులుకు జగన్ కు చెడిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.