ఏపీకి మూడు రాజధానులు కావాల్సిందేనని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను డెవలప్ చేయాలని జగన్ కంకణం కట్టుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, పైపైకి మాత్రం మూడు రాజధానులంటున్నా సరే…లోపల మాత్రం అమరావతి రాజధాని అంటూ వైసీపీ ప్రభుత్వం సీక్రెట్ గేమ్ ఆడుతోంది. తాజాగా అమరావతిపై జగన్ గుట్టును కేంద్ర ప్రభుత్వం రట్టు చేసిన వైనం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నిన్న జరిగిన కేంద్ర హోం శాఖ సమావేశం సాక్షిగా అమరావతిపై ఏపీ ప్రభుత్వం స్టాండ్ తేటతెల్లమైంది. రాజధానులకు అని కాకుండా ‘రాజధాని’కి నిధులను కేటాయించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. రాజధానికి మరో రూ.1000 కోట్లు నిధులు కావాలని కేంద్రాన్ని ఏపీ కోరింది. దీంతో, అమరావతే రాజధాని అని జగన్ ఒప్పుకున్నట్లయింది. అయితే, ఆల్రెడీ ఇచ్చిన రూ.1500కోట్ల ఖర్చుల వివరాలను పంపాలని, ఆ తర్వాత మిగతా వెయ్యి కోట్ల సంగతి చూద్దామని కేంద్రం సమాధానమిచ్చింది.
అమరావతి రాజధాని అభివృద్ధికి గతంలో కేంద్ర ప్రభుత్వం రూ. 2500 కోట్లు మంజూరు చేసింది. అందులో రూ.1500 కోట్లు చాలాకాలం క్రితమే విడుదలయ్యాయి. మరో రూ.1000 కోట్లు విడుదల కావాల్సి ఉంది. అయితే, వాడుకున్న రూ.1500 కోట్లకు ఏపీ ప్రభుత్వం యూసీలు సమర్పించలేదు. దీంతో, మరో వెయ్యికోట్లు అడిగే ముందు ఆ యూసీలు పంపాలని ఏపీ సర్కార్ కు కేంద్రం చురకలంటించింది.
ఇక, రాజధాని నిర్మాణానికి శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో సూచించిన రూ.29వేల కోట్లు ఇవ్వాలని కూడా ఏపీ కోరింది. కానీ, దానిపై హోంశాఖ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బాకీలు, విద్యుత్ బకాయిల అంశం, సంస్ధల విభజనపై ఏపీ లేవనెత్తిన ఏ అంశంలోనూ తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలపలేదు. దీంతో, విభజన సమస్యలపై ఎలాంటి స్పష్టత లేకుండానే, ఏ ఫలితం లేకుండానే ఈ భేటీ ముగిసింది.