డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరు పెట్టాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తమకు ఎన్టీఆర్ అంటే అపారమైన గౌరవం అంటున్న వైసీపీ నేతలు…పేరు మాత్రం వైఎస్సార్ ది పెడతామంటూ చెల్లని లాజిక్కులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్ గొప్పా…? ఎన్టీఆర్ గొప్పా…? అన్న చర్చకు వైసీపీ, టీడీపీ నేతలు తెరతీశారు.
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ పై వైసీపీ నేత, మంత్రి దాడిశెట్టి రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపింది. ఎన్టీఆర్ ను, వైఎస్సార్ ను పోల్చుతూ చర్చ జరుగుతోందని, వైఎస్సార్ కు ఎన్టీఆర్ కు పోలికే లేదని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ అంత చేతకానివాడు భారతదేశం మొత్తమ్మీద ఇంకెవరూ లేరంటూ దాడిశెట్టి రాజా అవమానకరరీతిలో వ్యాఖ్యానించడంపై మరోసారి రాజకీయ దుమారం రేగింది.
ఈ నేపథ్యంలోనే రాజా వ్యాఖ్యలపై ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. ఎన్టీ రామారావు అంటే తమకు అమితమైన గౌరవం ఉందని చెప్పే ముఖ్యమంత్రి జగన్ గారూ… ఈ మంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అని పురంధేశ్వరి ప్రశ్నించారు. ఒకవేళ ఈ మంత్రిపై చర్యలు తీసుకోకపోతే ఇది మీ అభిప్రాయం కూడా అని భావించాలా? అంటూ జగన్ ను నిలదీశారు. దాడిశెట్టి రాజా వ్యాఖ్యల వీడియోను షేర్ చేస్తూ పురంధేశ్వరి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతకుముందు, దాడిశెట్టి రాజా వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే.