డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీతోపాటు విపక్ష పార్టీలన్నీ ఖండించాయి. అయితే, అనూహ్యంగా జగన్ నిర్ణయాన్ని సొంత పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు నేతలు కూడా తప్పుబట్టారు. ఈ క్రమంలోనే పేరు మార్పునకు వ్యతిరేకంగా అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేయడం సంచలనాం రేపింది.
జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్న యార్లగడ్డ వైసీపీకి కూడా తన మద్దతుని ఉపసంహరించుకుంటారని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన యార్లగడ్డ…జగన్ హీరో అంటూ ఆకాశానికెత్తేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా తన దృష్టిలో జగన్ హీరో అంటూ ఆయన కితాబిచ్చారు. జగన్ ను కేంద్ర మంత్రిని చేస్తానని సోనియా గతంలో హామీ ఇచ్చారని, కానీ, ఆ పదవి తనకు అవసరం లేదంటూ ఓదార్పు యాత్రకు వెళ్లిన వ్యక్తి జగన్ అని యార్లగడ్డ అన్నారు.
ఆ తర్వాత పిచ్చి కేసులో, మంచి కేసులో ఏదో ఒక కేసుల్లో 16 నెలల పాటు జగన్ జైల్లో ఉన్నారని, అనంతరం 3850 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారని యార్లగడ్డ అన్నారు. జనాభిమానాన్ని సంపాదించుకున్న జగన్ 151 మంది ఎమ్మెల్యేలను 23 మంది ఎంపీలను గెలిపించుకున్నారని, ఇది హీరోయిజం కాదా అని యార్లగడ్డ ప్రశ్నించారు. అయితే, జగన్ చేసే పనులు కొందరికి నచ్చకపోవచ్చు అని చెప్పారు. అడగకుండానే తనను భాషా సంఘం చైర్మన్ గా జగన్ నియమించారని చెప్పుకొచ్చారు.
పేరు మార్చడం అనేది మంచి సంప్రదాయం కాదన్నది తన అభిప్రాయమని, ఇలా పేర్లు మార్చుకుంటూ పోయే ప్రక్రియకు అంతం ఉండదని యార్లగడ్డ అభిప్రాయపడ్డారు. ఆ నిర్ణయం తన మనసుకు నచ్చలేదు కాబట్టి తన పదవిని వదిలేశానని చెప్పారు. కానీ, నిత్యం ప్రజల మధ్య ఉండే జగన్ ను తాను ఎంందుకు తిట్టాలి అని? జగన్ ను దూషించి మరో పార్టీ వారిని ఎందుకు పొగడాలి అని వ్యాఖ్యానించారు.
తాను మాట మార్చడం లేదని, రాజీనామాపై రాజీ పడబోనని చెప్పుకొచ్చారు. 15 ఏళ్లుగా తెలుగు భాషకు సేవ చేస్తున్నానని, ఇకపై కూడా అదే చేస్తానని, రాజకీయాలు మాట్లాడబోవనని యార్లగడ్డ స్పష్టం చేశారు. జగన్ హీరో అంటూనే పదవికి రాజీనామా చేసిన యార్లగడ్డపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.