అమరావతిపై ఏపీ సీఎం జగన్ కక్షగట్టారని టీడీపీ నేతలతోపాటు విపక్ష పార్టీల నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.కేవలం టీడీపీని, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన జగన్ మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కోర్టులు చెప్పినా సరే…ప్రతిపక్ష నేతలు గగ్గోలు పెడుతున్నా సరే వైసీపీ నేతలు మాత్రం తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా మూడు రాజధానుల పాటకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్యూన్స్ కడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై జగన్ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయమని జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం కూడా తప్పుడు నిర్ణయమంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్నాయి.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సరికాదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని జగ్గారెడ్డి అన్నారు. జగన్ నిర్ణయంపై ఏపీ కాంగ్రెస్ కూడా అసంతృప్తితోనే ఉందని చెప్పారు. మూడు చోట్ల మూడు రాజధానులను అభివృద్ధి చేయడం సాధ్యం కాదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ అమరావతికి అనుకూలంగానే వ్యవహరించారని గుర్తు చేశారు.
“తెలుగు ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తి ఎన్టీఆర్. వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసి వివాదానికి దారి తీయడం తప్పు. వివాదాలతో పేరు పెడితే వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది. పైగా.. అందరూ తిట్టుకుంటారు కూడా! వైసీపీలో ఎన్టీఆర్ వద్ద పనిచేసిన వాళ్లే ఉన్నారు కదా? జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫ్యాక్షన్ స్టైల్లోనే ఉంటే ఎట్లా ఆయన మారాలి. ఎన్టీఆర్ పేరును తీసేయొద్దు” అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
అంతే కాదు, విస్తృత దృక్పథం, ప్రయోజనాలతోనే అమరావతిని రాజధానిగా చంద్రబాబు నిర్ణయించారని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీ రాజకీయాలలో అమరావతి రాజధాని, మూడు రాజధానులు, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వంటి వ్యవహారాలు హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. చంద్రబాబు విజన్ ను తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేత గుర్తించారని, కానీ, ఏపీలోని వైసీపీ నేతలు మాత్రం గుర్తించలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.