డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా సీఎం జగన్ మార్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా సరే వైఎస్ఆర్ పేరును పెట్టడాన్ని వైసీపీ నేతలు గట్టిగా సమర్థించుకుంటున్నారు. అసలు, ఏపీ చరిత్రలో వైద్యరంగంలో వైయస్సార్ తెచ్చిన సంస్కరణలు మరే ముఖ్యమంత్రి తేలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు.
అందుకే ఆ యూనివర్సిటీ పేరు వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చామంటూ తమ తప్పుడు నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు కూడా. ఇక, తన హయాంలో, తన తండ్రి హయాంలో రాష్ట్రంలో ఎన్నో వైద్య సంస్కరణలు అమలు చేశామని, ఆస్పత్రుల దశ దిశ మార్చేశామని జగన్ చెప్పుకుంటున్నారు. అయితే, వాస్తవం అందుకు భిన్నంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళగిరి ఎయిమ్స్ కు నీటి సరఫరా కావడంలేదన్న వార్త వైరల్ అయింది.
ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ కు కనీసం నీటి సరఫరా చేయలేని ప్రభుత్వాన్ని ఏమనాలని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ మూడున్నర ఏళ్లలో ఎయిమ్స్ కోసం ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన నిలదీశారు. టీడీపీ హయాంలో ఎయిమ్స్ కు భూములు కేటాయించి, మౌలిక వసతులు కల్పించి వైద్య సేవలకు సిద్ధపడేలా చేశామని అన్నారు.
నేడు ఆ సంస్థ పెరిగిన తమ అవసరాలకు అనుగుణంగా అదనంగా నీటి వనరులు కేటాయించాలని లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, జగన్ అసమర్ధతకు ఇది నిదర్శనం అని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అన్నీ తామే తెచ్చామని, అసెంబ్లీలో కూడా జగన్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాను నివసిస్తున్న మున్సిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని జగన్ ను ప్రశ్నించారు.
స్వయంగా కేంద్ర మంత్రులు కూడా ఈ నీటి సమస్యపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా జగన్ స్పందించలేదని, అటువంటి జగన్ వైద్యరంగంలో సమూల మార్పులు తనవల్లేనని బొంకుతున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ చేతగానితనం లక్షలాదిమంది ప్రజలకు శాపంగా మారకూడదని, తక్షణమే మంగళగిరి ఎయిమ్స్ కు అన్ని రకాల అదనపు మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.