కొద్ది రోజులుగా సీఎం జగన్ పాలనపై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ‘అమరావతి వివాదాలు-వాస్తవాలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తులసి రెడ్డి….జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగట్టారు. అమరావతిపై జగన్ విషం చిమ్మడాన్ని తప్పుబట్టారు. మూడు రాజధానులంటూ వైసీపీ నేతలు, జగన్ ఆడుతున్న నాటకాలను బట్టబయలు చేశారు.
ఇక, తాజాగా కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో తులసి రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలతో మీడియా ముందుకు వచ్చారు. కుప్పాన్ని చంద్రబాబు ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్న జగన్ మాటలను తులసి రెడ్డి ఖండించారు. కుప్పంను పులివెందులతో సమానంగా అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పడం హాస్యాస్పదమని తులసిరెడ్డి సెటైర్లు వేశారు. పులివెందులలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదని తులసిరెడ్డి ఆరోపించారు.
వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె, జగన్ చెల్లెలు సునీతా రెడ్డి కుటుంబానికే పులివెందులలో రక్షణ లేదని తులసి రెడ్డి మండిపడ్డారు. అటువంటి పరిస్థితులున్న పులివెందులను జగన్ ఇతర నియోజకవర్గాలతో పోల్చడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. జగన్ ఇస్తున్న అమ్మఒడి, ఆసరా, చేయూత తదితర పథకాలన్నీ నాన్న బుడ్డీకే చాలడం లేదని ఎద్దేవా చేశారు.
మట్టిముంత ఇచ్చి వెండి చెంబును దొంగిలించినట్టుగా వైసీపీ అధినేత తీరు ఉందని చురకలంటించారు. మరి, తులసి రెడ్డి కామెంట్లపై వైసీపీ నేతల స్పందన ఏవిధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.