జగన్ అక్రమాస్తుల కేసులో పలువురు ఐఏఎస్ లు నానా ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలో జగన్, వైఎస్ మాట కాదనలేకపోయిన ఐఏఎస్ లు కొందరు ఇపుడు కోర్టుల చుట్టు తిరగాల్సివస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటోన్న ఐఏఎస్ శ్రీలక్ష్మికి గతంలో సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం సంచలనం రేపింది.
ఇక, తమకు నమ్మిన బంటుగా ఉంటూ జైలుకు కూడా వెళ్లి వచ్చిన శ్రీలక్ష్మిని జగన్ ఏరికోరి మరీ ఏపీకి బదిలీ చేయించుకుని కీలక బాధ్యతలు అప్పగించడం కూడా చర్చనీయాంశమైంది. ఆనాడు వైఎస్ఆర్ అయినా…ఈనాడు జగన్ అయినా…ఐఏఎస్, ఐపీఎస్ లను తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక, జర్నలిస్టు అంకబాబు విషయంలో పోలీసుల తీరును కోర్టు తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారం నేపథ్యంలోనే వైఎస్ఆర్, జగన్ లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జగన్ జైలుకు తీసుకెళ్లాడని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇక, తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లు, పలువురు పోలీస్ అధికారులను కూడా జగన్ జైలుపాలు చేయతున్నాడని లోకేశ్ విమర్శలు గుప్పించారు.
కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీనియర్ జర్నలిస్టు అంకబాబుకు 41ఏ నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేశారంటూ సీఐడీ అధికారులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారుల తీరు మారడం లేదని, జగన్ వల్ల వారు కూడా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.