జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓ పోస్ట్ ను ఫార్వార్డ్ చేశారన్న ఆరోపణలపై సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం రాజకీయ దుమారం రేపింది. 73 ఏళ్ల వయసున్న పాత్రికేయుడిని అదుపులోకి తీసుకోవడంపై జర్నలిస్టు సంఘాలు, టీడీపీ ఖండించారు. ఈ క్రమంలోనే సీఐడీ పోలీసుల తీరును నిరసిస్తూ గుంటూరులోని సీఐడీ కార్యాలయం ముందు మాజీ మంత్రి దేవినేని ఉమ, జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. సీఐడీ పోలీసులతో పాటు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ ఆఖరికి జర్నలిస్టులను కూడా వదలడం లేదని మండిపడ్డారు. అంకబాబుకు ఏమైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం పాత్రికేయుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని, వాక్ స్వాతంత్య్రం, పత్రికా స్వాతంత్య్రాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిందని ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. అంకబాబును తక్షణమే విడుదల చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు. వాట్స్యాప్ లో ఒక వార్తను ఫార్వార్డ్ చేసిన కారణంగా 73 ఏళ్ల వయసున్న ఒక సీనియర్ జర్నలిస్ట్ ను అరెస్ట్ చెయ్యడం జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతోందని ఆయన ఫైర్ అయ్యారు.
ఈ ఆందోళనలో పాల్గొన్న మహా న్యూస్ ఎండీ వంశీ కృష్ణ సహా పలువురు జర్నలిస్టులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. జర్నలిస్టులపై జరుగుతున్న అక్రమ అరెస్ట్ లను ఖండించాలని వంశీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఆయన కోరారు.
అంకబాబు అరెస్ట్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అంకబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అంకబాబును అరెస్ట్ చేయడాన్ని దేవినేని ఉమ ఖండించారు. జగన్ చివరకు జర్నలిస్టులను కూడా వదల్లేదని మండిపడ్డారు. అంకబాబుకు గుండె సమస్య ఉందని చెప్పినా సీఐడీ అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అంకబాబును విడుదల చేయాలని ఉమ డిమాండ్ చేశారు.