తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇంజక్షన్ మర్డర్ ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని ఇంజక్షన్ ఇచ్చి హతమార్చిన వైనం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. అయితే, ఇదేదో సైకో కిల్లర్ చేసిన హత్య అని తొలుత అందరూ భావించారు. కానీ, హత్య జరిగిన విధానంలో అనుమానాలు రేకత్తడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపారు. ఆ విచారణలో వారికి దిమ్మతిరిగే వాస్తవాలు వెల్లడయ్యాయి.
తన భర్తను చంపించేందుకు పక్కా ప్రణాళికతో భార్య ఆ హత్యకు పథకం రచించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ముగ్గురు వ్యక్తులతో కలిసి తన భర్తను ఆ మహిళ కడతేర్చిందన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు జమాల్ సాహెబ్ భార్యతో కలిసి ఈ హత్యకు పథకం రచించారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
చింతకాని మండలం మున్నేటి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ హత్యలో పాల్పంచుకున్నట్లు తెలుస్తోంది. నిందితుల్లో ఇద్దరు డ్రైవర్లు కాగా మరొకరు ఆర్ఎంపీ అని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. జమాల్ సాహెబ్ భార్య… నిందితులకు పలమార్లు ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది.
వివాహేతర సంబంధం కోణంలోనే పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. అయితే, ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా ఇంకా వెల్లడించాల్సింది. ఈ రోజు సాయంత్రం పోలీసులు ఈ కేసుకు సంబంధించిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.