డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైసీపీ ప్రభుత్వం డాక్టర్ వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రకారం అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ కావడంతో టీడీపీ సభ్యులు మండిపడుతున్నారు. బిల్లు పాసయ్యే సమయానికి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన నేపథ్యంలో అసెంబ్లీ వెలుపల టీడీపీ సభ్యులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తుళ్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.
తమ నిరసనలో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు ప్రతులను అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు తగులబెట్టారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు జగన్ మాదిరిగా ఆలోచించి ఉంటే వైఎస్సార్ పేరు, వైఎస్సార్ విగ్రహాలు మిగిలేవి కావని ఆయన అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ పోవడం ప్రమాదకరమైన సంస్కృతి అని జగన్ కు అర్థం కావడం లేదని అచ్చెన్న దుయ్యబట్టారు.
టీడీపీ హయంలో చంద్రబాబు ఎంతో విజ్ఞతతో వ్యవహరించి వైయస్సార్ పేరును తొలగించలేదని అన్నారు. జగన్ లెంపలేసుకుని ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు రద్దయ్యే వరకు టీడీపీ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు, జగన్ పై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఆ హెల్త్ వర్సిటీ పెట్టిన సమయంలో రాజశేఖర్ రెడ్డి ఎక్కడున్నారని కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు.
అంతేకాదు, లక్షలాది మంది డాక్టర్లను తయారు చేస్తున్న యూనివర్సిటీకి రౌడీ పేరు పెట్టడం ఏంటి అని మండిపడ్డారు. వెంటనే ఆ పేరు మార్చుకుంటే జగన్ చరిత్ర హీనుడు అవుతాడని, ప్రజలు, చరిత్ర జగన్ ను క్షమించవని చెప్పారు.