విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చాలని అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ యూనివర్సిటీ విజయవాడకు రావడానికి తీవ్ర కృషి చేసిన అన్నగారి పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం ఏమిటని టీడీపీ సభ్యులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
ఎన్టీఆర్ పేరు తొలగింపును టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చంద్రబాబు అన్నారుజ వైద్య విద్యకు ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని ఎన్టీఆర్ సంకల్పించారని, ఆ క్రమంలోనే 1986లో హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే, ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో టీడీపీ ప్రభుత్వం దానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చిందని చెప్పుకొచ్చారు.
వైఎస్ఆర్ సహా ఇప్పటివరకు చాలామంది ఏపీకి ముఖ్యమంత్రులుగా పని చేశారని, కానీ పేరు మార్చాలన్న ఆలోచన ఒక్క జగన్ కు మాత్రమే వచ్చిందని చంద్రబాబు దుయ్యబట్టారు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో పురుడు పోసుకున్న ఈ యూనివర్సిటీకి ఇప్పుడు వైఎస్ఆర్ పేరు పెట్టడం అర్ధరహితమని అన్నారు. మూడున్నరేళ్లల్లో ఏపీలో కొత్తగా ఒక్క నిర్మాణం కూడా చేపట్టలేని జగన్ సర్కార్ ఉన్న నిర్మాణాల పేర్లు మార్చడం ఏమిటని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన 450 కోట్ల రూపాయల నిధులను కూడా జగన్ బలవంతంగా లాగేసుకున్నారని, ఏ హక్కుతో ఆ యూనివర్సిటీ పేరు మార్చుతున్నారని చంద్రబాబు నిలదీశారు. కనీసం యూనివర్సిటీ స్నాతకోత్సవ నిర్వహణకు కూడా నిధులు లేకుండా చేసిన జగన్ ఇప్పుడు పేరు మారుస్తారా అంటూ మండిపడ్డారు. అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ కు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు.
ఇలా దశాబ్దాల చరిత్ర ఉన్న సంస్థల పేరు మార్చుకుంటే వైసీపీ ప్రభుత్వానికి మంచి పేరు రాదని, చెడ్డపేరు వస్తుందని అన్నారు. వారి దిగజారుడుతనాన్ని ప్రజలు ఛీకొడతారని అన్నారు. చేతనైతే కొత్తగా సంస్థలను నిర్మించి వాటికి పేర్లు పెట్టుకోవాలని హితవు పలికారు. ఇకనైనా ప్రభుత్వం ఇటువంటి పిచ్చి ఆలోచనలు మానుకొని ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును యధాతథంగా కొనసాగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.