టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ల కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా పాన్ వరల్డ్ లెవెల్ లో హాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈసారి ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ సినిమా తప్పక నిలుస్తుందని భారతీయులు…ముఖ్యంగా తెలుగువారు గంపెడాశలు పెట్టుకున్నారు.
అంతేకాదు, ఆ ఆశలకు తగ్గట్టుగానే ఆస్కార్ బరిలో నిలిచే నటీనటులు, చిత్రాల పేర్లను ముందుగానే ప్రెడిక్ట్ చేసే వెరైటీ మ్యాగజైన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిలకు ఆస్కార్ దక్కే అవకాశం ఉందని ప్రచురితమైంది. దీంతో, ఈసారి తెలుగు సినిమాకు ఆస్కార్ తప్పక వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఆ ఆలోచనలపై, ఆశలపై నీళ్లు చల్లుతూ తాజాగా ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి అధికారిక ఎంట్రీ ఖరారైంది.
మన దేశం తరఫున గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ (ఆఖరాట) ఆస్కార్ బరిలో నిలిచింది. ఇప్పటికే, అంతర్జాతీయ స్థాయిలో ‘లాస్ట్ ఫిలిం షో’ పేరిట ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ప్రదర్శితతమైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ది కశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలను వెనక్కి నెట్టి మరీ ఈ చిన్న సినిమా ఆస్కార్ రేసులో దూసుకుపోవడం విశేషం. ఈ సారి ఆస్కార్ అవార్డులలో ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరిలో ఈ సినిమా పోటీ పడనుంది.
ఈ సినిమాతో పాటు వివిధ దేశాల నుంచి ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో మరిన్ని చిత్రాలు నామినేట్ కానున్నాయి. ఆ పోటీలో నెగ్గి ‘ఛెల్లో షో’ భారత్ కు ఆస్కార్ అందించే ఆస్కారం ఉందా లేదా అన్నది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడక తప్పదు. గుజరాతీ దర్శకుడు పన్ నళిన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా పేరు ట్రెండ్ అవుతుంది.