ఏపీ అసెంబ్లీ సమావేశాలు అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటలు యుద్ధానికి వేదికగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి సమావేశాల్లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై సభలో గందరగోళం ఏర్పడింది. ఆ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటిగా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని టీడీపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా దానికి సంబంధించిన బిల్లును కూడా సభలో మంత్రి విడదల రజనీ ప్రవేశపెట్టడంపై మండిపడ్డారు.
అన్నగారి చొరవతో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ పేరులో ఎన్టీఆర్ ను తొలగించడంపై టీడీపీ సభ్యులు మండిపడ్డారు. యూనివర్సిటీ ఏర్పాటు చేసింది ఎన్టీఆర్ అని, ఆయన గౌరవార్థం ఆ పేరును పెట్టారని చెప్పారు. అటువంటి ఎన్టీఆర్ పేరును జగన్ తొలగిస్తానని అనడం ఏమిటని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు.
ఆ బిల్లు కాపీలను చించివేసి స్పీకర్ పోడియం దగ్గర నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై వైసీపీ సభ్యులు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో, టీడీపీ సభ్యులను సభనుంచి సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తీర్మానం చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులను యథావిధిగా స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. అయితే, సస్పెండ్ చేసినప్పటికీ టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లకుండా అక్కడే నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ప్రాణాలు అర్పించైనా సరే ఎన్టీఆర్ పేరు సాధిస్తామంటూ వారు నినదించారు. ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులను మార్షల్స్ బలవంతంగా అసెంబ్లీ నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఈ వ్యవహారం నేపథ్యంలో జగన్ పై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.