తనను ఏపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చాలా రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాలను, సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నానని తనపై కక్ష పెంచుకున్నారని రఘురామ ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ రఘురామయ్య వైసీపీ నేతలు గతంలో ఆరోపించారు. రాజద్రోహం కేసు పెట్టి అరెస్టు చేయించి కస్టడీలో తనను కొట్టారని రఘురామ ఆరోపించారు.
అంతేకాదు, ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో…హైదరాబాదులోనే విచారణ చేయాలని రఘురామ కోరారు. దానికి అంగీకరించిన సుప్రీం కోర్టు ఆయనకు అనుకూలంగా ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 19న హైదరాబాద్లో విచారణకు హాజరు కావాలని రఘురామకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని స్వయంగా రఘురామ వెల్లడించారు. అయితే ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని, కేవలం తనకు మాత్రమే నోటీసులు పంపిందని రఘురామ అన్నారు.
తనకు సెప్టెంబర్ 16న నోటీసులు వచ్చాయని, వాటికి తాను సమాధానం కూడా ఇచ్చానని చెప్పారు. అయితే, ఇదే కేసులో మరో రెండు తెలుగు న్యూస్ ఛానళ్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాయని, కానీ వాటికి మాత్రం నోటీసులు ఇవ్వలేదని రఘురామ అన్నారు. కేవలం తనను టార్గెట్ చేసి, వాటికి నోటీసులు ఇవ్వలేదని రఘురామ అన్నారు. హైదరాబాద్ లో ఉన్న రెండు ప్రముఖ వార్తా ఛానళ్లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయని, కానీ, తనకు మాత్రమే నోటీసులు ఇచ్చారని అన్నారు.
ఇదే విషయాన్ని సీఐడీకి ఇచ్చిన సమాధానంలో తాను చెప్పానని, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలిపానని చెప్పారు. మరి, ఈ క్రమంలోనే హైదరాబాద్లోని దిల్ కుషా గెస్ట్ హౌస్ లో నేడు జరిగే విచారణకు రఘురామ హాజరవుతారా లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
Comments 1