కరోనా పుణ్యమా అని దాదాపు రెండేళ్లకు పైనే ప్రపంచ స్థాయిలో సదస్సులు చాలా తక్కువ జరిగాయి. దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పెద్ద ఎత్తున విదేశీ పర్యటనలు చేయటమే కాదు.. దశాబ్దాల తరబడి మన దేశ ప్రధాని వెళ్లని ఎన్నో దేశాలకు వెళ్లి వచ్చిన ఘనత మోడీదే. ఇక.. ప్రపంచంలో జరిగే పలు సదస్సులకు హాజరు కావటం.. భారత్ గళాన్ని ప్రత్యేకంగా వినిపించే విషయంలో ఆయన విజయవంతం అయ్యారని చెప్పాలి. తాజాగా ఉజ్బెకిస్థాన్ లో జరుగుతున్న ఎస్పీవో సదస్సుకు హాజరైన మోడీ.. భారత్ తరఫున తన గళాన్ని వినిపించటం ఒక ఎత్తు అయితే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు.
ఉక్రెయిన్ సంక్షోభాన్ని త్వరగా ముగించాలని.. ఇది యుద్ధాల కాలమన్న విషయాన్ని సుతిమెత్తగా పుతిన్ ముఖం మీదనే చెప్పేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. పుతిన్ తో భేటీ సందర్భంగా మోడీ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. ఇండియా – రష్యాల మధ్య వీసాలు లేకుండా ప్రయాణాలకు అనుమతించేలా ఇరు దేవాలు పరస్పర నిబంధనలను రూపొందించుకోవాలని కోరినట్లుగా రష్యా అధికార వార్తా సంస్థ ‘టాస్’ వెల్లడించింది. దీనికి సంబంధించి పుతిన్ ఏ రీతిలో స్పందిస్తారో చూడాలి.
ప్రస్తుతం జరుగుతున్న ఎస్ సీవో (షాంఘై సహకార సంస్థ) సదస్సును ఉజ్బెకిస్థాన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భారత్.. రష్యా.. చైనా.. టర్కీ.. పాకిస్థాన్ తో సహా మొత్తం 8 దేశాలు సభ్య దేశాలుగా వ్యవహరిస్తుంటాయి. ప్రస్తుతం ఈ సంస్థకు అధ్యక్ష స్థానంలో ఆ దేశం ఉంది. రొటేషన్ పద్దతిలో.. ఒక్కో దేశం నిర్వహించాల్సి ఉంది. తాజాగా ఉజ్బెకిస్థాన్ స్థానంలో భారత్ కు దాని పగ్గాలు అప్పజెప్పారు. ఇక.. ఈ రోజు (శనివారం) ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా రష్యా అధ్యక్షుడు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మై డియర్ ఫ్రెండ్. రష్యా సంప్రదాయం ప్రకారం ముందస్తుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పం. అందుచేత ఇప్పుడు చెప్పలేను. మీ నాయకత్వంలో భారత్ పురోగమించాలని కోరుకుంటున్నాం’’ అని వ్యాఖ్యానించటం గమనార్హం.
ఈ సదస్సులో మాట్లాడిన ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ ను ఉత్పాదక హబ్ గా మలచాలని భావిస్తున్నట్లుగా మోడీతెలిపారు. దేశాల నడుమ అనుసంధానత పెరగాలని పిలుపును ఇచ్చారు. భారత్ లో 60 వేలకు పైగా స్టార్టప్ లు పని చేస్తున్నాయని.. వందకు పైగా యూనికార్న్ లు ఉన్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ లో సంప్రదాయ ఔషధాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పి.. సంప్రదాయ ఔషధంపై సభ్య దేశాల మధ్య సహకారం పెరగాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.