ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతు తిరిగొచ్చేసిన విద్యార్ధుల భవిష్యత్తు దెబ్బతిన్నట్లే అనుకోవాలి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా వేలాది మంది విద్యార్థులు అర్ధాంతరంగా మన దేశానికి తిరిగొచ్చేశారు. మనదేశం నుండి ఉక్రెయిన్ వెళ్ళి రకరకాల కోర్సులు చేస్తున్నవారు వేలల్లో ఉన్నారు. ఇలాంటి విద్యార్ధుల్లో సుమారు 23 వేల మంది వైద్య విద్యార్ధులున్నారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ చూసిన తర్వాత వీళ్ళందరి భవిష్యత్తు పూర్తిగా దెబ్బతినేసినట్లే అర్ధమవుతోంది.
పై రెండు దేశాల మధ్య యుద్ధం కొన్ని నెలలు ఆలస్యంగా మొదలయ్యుంటే వైద్య విద్యార్ధుల కోర్సు పూర్తయిపోయేదే. ఎందుకంటే ఉక్రెయిన్లో వైద్య విద్య ఆరేళ్ళ కోర్సు. ఈ కోర్సును విద్యార్ధులంతా దాదాపు పూర్తిచేసేశారు. ఇక మిగిలున్నది ఏమిటంటే పరీక్షలు రాయటం మాత్రమే. పరీక్షల తేదీలు కూడా అక్కడ కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయట. ఆ దేశలో హఠాత్తుగా యుద్ధం మొదలైంది. కొద్దిరోజుల్లోనే యుద్ధం ముగుస్తుందన్న నమ్మకంతో విద్యార్ధులంతా అక్కడే ఉన్నారు.
అయితే యుద్ధం తీవ్రరూపం దాల్చింది. దాంతో నగరాల మీద కూడా బాంబులు పడతాయని తమ జీవనానికి గ్యారెంటీ లేదని తేలటంతో విద్యార్ధుల్లో బతుకు భయం మొదలైంది. వేలాదిమంది విద్యార్ధుల గోల చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు దేశాల అధినేతలతో మాట్లాడి ప్రత్యేక విమానాలు వేసి విద్యార్ధులందరినీ భారత్ కు రప్పించింది. తర్వాత యుద్ధంలో యూనివర్సిటీలు కూడా నేలమట్టమైపోయాయి.
దీంతోనే వీళ్ళ చదువులపై అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలోనే హఠాత్తుగా విదేశాలకు వెళ్ళిపోయిన విద్యార్ధులందరినీ తిరిగిరావాలని ఉక్రెయిన్ ప్రభుత్వం కోరింది. యూనివర్సిటీలన్నీ తెరుచుకుంటున్న కారణంగా విద్యార్థులంతా వచ్చి చదువులు కంటిన్యూ చేయాలని కోరింది. ఒకవైపు యుద్ధం జరుగుతోంది మరోవైపు విద్యార్ధులందరినీ తిరిగి రావాలని ఉక్రెయిన్ ప్రభుత్వం కోరటమే ఆశ్చర్యంగా ఉంది. యుద్ధం జరుగుతున్న కారణంగా విద్యార్థులు ఎవరు తిరిగి ఉక్రెయిన్ వెళ్ళేందుకు ఇష్టపడటంలేదు.
ఈ కారణంతోనే తమకు దేశంలోని మెడికల్ కాలేజీల్లోనే సీట్లిప్పించి తాము పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని విద్యార్థుల సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. నిజానికి ఉక్రెయిన్లో చదువుకున్న విద్యార్ధులను ఇండియాలో పరీక్షలు రాయించటం అసాధ్యం. ఈ విషయం విద్యార్ధులకు తెలిసినా కోర్టులో పిటీషన్ వేశారు. దీన్నే కేంద్రం సాధ్యం కాదని తేల్చేసింది. దీంతో ఇపుడు వేలాదిమంది భవిష్యత్తు దెబ్బతినేస్తోంది.