తెలంగాణలో ఇటీవల కాలంలో భారీ స్కాం బయట పడింది. దాదాపు 2500 కోట్ల రూపాయల భూ కుంభకో ణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. రాజధాని హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన.. భూమి విషయం లోనే ఈ ఆరోపణలు వచ్చాయి. అయితే.. దీనిపై ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ స్పందించలేదు. అయితే.. సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించాలంటే.. ఈ వివాదం ఆయన చూస్తున్న రెవెన్యూ శాఖలోనే వెలుగు చూడడం గమనార్హం. కనీసం విచారణకు ఆదేశించటం.. చర్యలు తీసుకోవడం వంటి వాటిపై కేసీఆర్ దృష్టి పెట్టలేదు.
భవిష్యత్ అవసరాలకు అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వ భూములను విక్రయిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఏకంగా 2500 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారనేది ప్రధాన అభియోగం. గుట్టలబేగంపేట గ్రామంలోని సర్వే 63లో 54 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కు చెందిన బినామీ వ్యక్తికి కట్టబెట్టారనే చర్చ సాగుతోంది.
ఇది ప్రభుత్వ భూమి అయితే.. ప్రైవేట్ పట్టా ల్యాండ్ గా ప్రకటించారు. ఈ భూమి జూబ్లిహిల్స్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థకు ఆనుకుని ఉంది. ఈ భూమి తమ చేతికి రాక ముందే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కొందరికి దీనిని గజం 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల మేర విక్రయించి సొమ్ము చేసుకుందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ భూమిని రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి తొలగించారు.
అనంతరం.. ప్రైవేటుగా భూమిగా ప్రకటించి.. విక్రయించారనేది ఆరోపణ. దీనిపై ఒక మీడియా సంస్థ కూడా కథనం ప్రచురించింది. ఇంత జరిగినా.. రాష్ట్ర సర్కారు మాత్రం పెదవి విప్పడం లేదు. పోనీ.. విపక్షాలైనా దీనిని యాగీ చేస్తున్నాయా? అంటే.. అది కూడా లేదు. ఈ పరిణామాలతో అసలు ఏం జరిగింది? తెరచాటున జరిగి విషయం ఏంటి? అనేది సామాన్యులకు అంతుచిక్కడం లేదు.
తెలంగాణలో అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న బీజేపీ కూడా ఈ భూకుంభకోణంపై ఎక్కడా నోరెత్తిన దాఖలాలు లేవు. ఇక, నగరరంలోని కీలక ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్లో భారీ డీల్స్ జరుగుతున్నాయని.. అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే సాగుతున్నాయని ఇటీవల కాలంలో ఆరోపణలు వస్తున్నాయి. మరి వీటిపై సర్కారు పెద్దలు ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.