ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న సంగతి తెలిసిందే. జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు చివరకు కోర్టుల వరకు వెళ్లడం, అక్కడ కూడా చుక్కెదురు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం భంగపాటుకు గురి కావడం పరిపాటిగా మారింది. జగన్ ఒంటెత్తు పోకడలపై ఎన్ని విమర్శలు వస్తున్నా సరే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న రీతిలో ఉన్న జగన్ తీరు మాత్రం మారడం లేదు.
ఈ క్రమంలోనే కొద్ది రోజులు క్రితం రాష్ట్రంలోని దస్తావేజు లేఖర్లకు సంబంధించి జగన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్ల ప్రవేశాన్ని నిషేధిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి, ఆస్తుల క్రయవిక్రయాలు జరిపే ప్రజలకు మధ్య వారధిలా ఉండే దస్తావేజు లేఖరులను ఆఫీసులోకి అనుమతించకపోవడం చర్చకు దారితీసింది.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖరుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. దశాబ్దాలుగా తాము ఈ వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ కడుపు కొడుతోందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వారు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిపిన ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
దస్తావేజు లేఖరులపై ఏపీ సర్కార్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి దస్తావేజు లేఖరుల ఎంట్రీకి హైకోర్టు మార్గం సుగమం చేసింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో జగన్ కు న్యాయస్థానంలో మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్లయింది. ఇకపై అయినా ఇటువంటి ఉత్తర్వులు జారీ చేసే, ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు జగన్ ఒకటికి రెండుసార్లు ఆలోచించి అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకొని ముందుకు వెళ్లాలని అంటున్నారు. లేదంటే ఇలాగే కోర్టులో చేతులు అక్షింతలు తప్పవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.