దక్షిణాదిలో మంచి నటిగా అమలా పాల్ గుర్తింపు తెచ్చుకుంది. తమిళ సినిమాలతో పాటు తెలుగు, మలయాళ సినిమాలలోనూ రాణిస్తోంది అమలా పాల్. ఇటీవల కడవర్ వంటి విభిన్న చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన అమలా పాల్…గతంలో ఆమె వంటి ప్రయోగాత్మక చిత్రాలలోనూ నటించి మెప్పించింది. అయితే, ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో అమలాపాల్ పెద్దగా కనిపించడం లేదు.
2015లో చివరిగా తెలుగు సినిమాలో నటించింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అమలా పాల్ టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తెలుగులో అతి తక్కువ సినిమాలు చేయడానికి గల కారణాలను వెల్లడించింది. తెలుగు చిత్ర పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతుల్లో బందీ అయిందని అమలా పాల్ షాకింగ్ కామెంట్లు చేసింది. టాలీవుడ్ లో పనిచేసిన కొత్తలోనే తనకు ఈ విషయం అర్థమైందని వ్యాఖ్యానించింది.
ఆ కొన్ని కుటుంబాలే చిత్ర పరిశ్రమపై ఆధిపత్యం చలాయిస్తున్న విషయాన్ని గుర్తించానని చెప్పింది. వారు తీసే సినిమాలు కూడా భిన్నంగా ఉండేవని, వారి ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉండేవారని అమలా పాల్ షాకింగ్ కామెంట్లు చేసింది. వారిని గ్లామరస్ గా చూపిస్తూ లవ్ సీన్స్, పాటలకు మాత్రమే పరిమితం చేసేవారని చెప్పుకొచ్చింది. ఆ సినిమాలు చాలా కమర్షియల్గా ఉండేవని, అందుకనే తాను తెలుగు ఇండస్ట్రీకి దగ్గర కాలేకపోయానని బాంబు పేల్చింది అమలా పాల్.
కెరీర్ మొదలుబెట్టినపుడు ఆడిషన్స్, మీటింగ్స్ వంటి ఇబ్బందులు ఫేస్ చేశానని గుర్తు చేసుకుంది. తమిళ సినిమాతో కెరీర్ ప్రారంభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. తాను కెరీర్ మొదట్లో చేసిన 2 సినిమాలు ఇప్పటికీ విడుదల కాలేదని, ఆ తర్వాత చేసిన ‘మైనా’ సంచలనం సృష్టించిందని చెప్పింది. ఆ చిత్రం తర్వాత ఆఫర్లు క్యూ కట్టాయని గుర్తు చేసుకుంది. ఏది ఏమైనా, టాలీవుడ్ పై అమలా పాల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.