అగ్గిపుల్ల..కుక్కపిల్ల..సబ్బు బిళ్ల..కాదేదీ కవితకనర్హం అన్నారు మహా కవి శ్రీశ్రీ…కానీ, ప్రభుత్వ స్థలం..ప్రైవేటుస్థలం..కొండా..గుట్ట…చెరువు, ఆఖరికి ప్రభుత్వ బడి కాదేదీ కబ్జాకనర్హం అంటున్నారు వైసీపీ నేతలు. ఖాళీగా ఉందికదా అని ఏకంగా పాఠశాల భవనంలోనే మకాం వేశారు. పాఠశాల రూపురేఖలు మార్చేసి కొత్త ఇల్లుగా టచప్ ఇచ్చారు. నంద్యాల జిల్లా పాణ్యంలో జరిగిన ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.
విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో ఐదేళ్ల క్రితం అధికారులు ఆ పాఠశాలను మూసివేశారు. అక్కడి విద్యార్థులను వేరే పాఠశాలకు పంపించారు. దీంతో, ఆ పాఠశాలపై వైసీపీకి చెందిన స్థానిక నేత కన్నుపడింది. ఇంకేముందు, పాఠశాల బోర్డు, శిలాఫలకం తీసేసి దానికి మరమ్మతులు చేయించుకున్నారు. 2 బెడ్ రూములు, కిచెన్, హాల్, మెట్లు నిర్మించారు. పాడుబడిన పాఠశాల ఉన్న చోట డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రత్యక్షమవడంతో స్థానికులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
అయినా సరే పట్టించుకోకపోవడంతో ఎట్టకేలకు స్థానికులు మీడియాను ఆశ్రయించారు. దీంతో, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో, ఈ వ్యవహారంపై చంద్రబాబు కూడా స్పందించారు. ఇదిగిదిగో వైసీపీ ప్రభుత్వ నాడు-నేడు అని చంద్రబాబు విమర్శించారు. అయితే, ఈ వ్యవహారంపై అధికారులు పట్టించుకోవడంలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని అడ్డుకునే ప్రయత్నం అధికారులు చేయలేదని విమర్శిస్తున్నారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని అంటున్నారు. అయితే, పాఠశాల భవనాన్ని మూసివేశారని, నిర్మాణాలు చేపట్టింది ఎవరో తనకు తెలియదని స్థానిక ఎంఈవో చెప్పడం విశేషం. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే పాఠశాల భవనానికి తాళాలు వేయించామని చెప్పి చేతులు దులుపుకున్నారు ఎంఈవో.