హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. తెలంగాణ సీఎం కేసీఆర్ పై అసోం సీఎం హిమంత బిశ్వకర్మ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీంతో, బిశ్వకర్మ ప్రసంగిస్తుండగానే టీఆర్ఎస్ కార్యకర్త ఒకరు ఆయన మైకు లాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఎంజే మార్కెట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
కేసీఆర్ పై శర్మ విమర్శలు గుప్పిస్తుండగా నందుబిలాల్ అనే టీఆర్ఎస్ కార్యకర్త…స్టేజిపైకి దూసుకువచ్చాడు. స్టేజి వెనుక నుంచి వచ్చిన అతడు..శర్మ ముందున్న మైక్‌ను తన చేతిలోకి తీసుకొని శర్మతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అప్రమత్తమైన గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు నందు బిలాల్‌ను అక్కడి నుంచి కిందకు దించి తరలించారు. దీంతో, ఆ వ్యవహారం సద్దుమణిగింది.
ఈ సందర్భంగా బిశ్వకర్మపై, బీజేపీ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బిశ్వశర్మ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ను ప్రశాంతంగా ఉండనీయరా? అంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. హైదరాబాద్ ప్రజలను రెచ్చగొట్టడానికే బిశ్వ శర్మ నగరానికి వచ్చారని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి హైదరాబాద్ కు వచ్చిన బిశ్వశర్మ…రాజకీయాలు మాట్లాడడం ఏంటని తలసాని ప్రశ్నించారు.
ఒక రాష్ట్ర సీఎం ఇలా దిగజారుడు మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదికపై తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం సరి కాదన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని, దీనిని తెలంగాణ ప్రజలెవరూ క్షమించరని అన్నారు. గవర్నర్ తమిళి సైపైనా తలసాని మండిపడ్డారు. గవర్నర్ తన పరిమితులకు మించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వాన్ని గవర్నర్ విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు. గవర్నర్ పదవికి కొన్ని పరిమితులు, బాధ్యతలు ఉంటాయనే విషయం ఆమె గుర్తుంచుకోవాలన్నారు. రాజ్యాంగానికి లోబడి మాత్రమే గవర్నర్ పని చేయాల్సి ఉందని చెప్పారు. రాజ్ భవన్ లో గవర్నర్ మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మంచి పద్దతి కాదన్నారు.