సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిగా కొనసాగడం ఇష్టం లేని జగన్….మూడు రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేశారు. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను అర్ధాంతరంగా వదిలేసిన జగన్…అమరావతే రాజధాని అని హైకోర్టు చెప్పినప్పటికీ డెడ్ లైన్ లోపు పెండింగ్ లోని నిర్మాణాలను పూర్తి చేయడం చేతకాదంటూ చేతులెత్తేశారు.
ఇక, అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేస్తామన్న వంక చెప్పి అక్కడి భూములకు జగన్ బేరం పెట్టడంపై కూడా విమర్శలు వచ్చాయి. అమరావతిలో వందల కోట్ల విలువైన భూముల విక్రయానికి ఏపీసీఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాజధాని పరిధిలో 2 సంస్థలకు కేటాయించిన 248.34 ఎకరాల భూమిని వేలం ద్వారా అమ్మేందుకు ప్రభుత్వానికి సీఆర్డీఏ ప్రతిపాదనలు పంపింది. ఎకరం భూమి కనీస ధరను రూ.10 కోట్లుగా నిర్ధారించి అమ్మకానికి పెట్టింది. మొత్తం 248 ఎకరాలను అమ్మి కనీసం రూ.248 కోట్లు సేకరించాలన్నది సీఆర్డీఏ లక్ష్యం.
వాస్తవానికి సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్ని రాజధాని అవసరాలకు మాత్రమే కేటాయించాలి. కోర్టు కూడా ఇదే చెబుతోంది. కానీ, జగన్ మాత్రం సీఆర్డీఏ చట్టాన్ని అడ్డుపెట్టుకొని భూదందా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సీఆర్డీఏ చట్టానికి కొత్త సవరణ తెచ్చిన అమరావతియేతర ప్రజలకు కూడా రాజధానిలో స్థలాలిస్తామంటూ కొత్త నాటకానికి తెర తీసింది.
సీఆర్డీఏ చట్టానికి ఏపీ సర్కార్ కీలక సవరణలు చేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ పధకాల అమలుకు వీలుగా సీఆర్డీఏ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీకి అనుగుణంగా సీఆర్డీఏ చట్ట సవరణకు నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, అమరావతి మాస్టర్ ప్లాన్ సహా ఇతరాత్ర మార్పుల కోసం చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది.
అదేమంటే, పేద వారికి అమరావతిలో ఇళ్లు కేటాయించాలన్న సదుద్దేశ్యంతో వెళుతున్నామని సమర్థించుకుంటోంది వైసీపీ. దీంతో, అమరావతి రాజధానిపై జగన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారని విమర్శలు వస్తున్నాయి. జగన్ సర్కార్ తాజా నిర్ణయాన్ని కోర్టులో ఎవరో ఒకరు కచ్చితంగా సవాలు చేస్తారని, తీర్పు ఏమిటన్నది పక్కనబెడితే ఇలా అమరావతిని ముక్కలు చేయాలన్న జగన్ ఆలోచనే సరికాదని అంటున్నారు.
Comments 1