టీడీపీ మాజీ నేత, నటి దివ్యవాణి కొంత కాలం క్రితం పార్టీ వీడిన సంగతి తెలిసిందే. తనకు పార్టీలో గౌరవం, ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తూ టీడీపీకి దివ్యవాణి రాజీనామా చేశారు. అయితే, వైసీపీలో చేరేందుకే దివ్యవాణి టీడీపీకి గుడ్ బై చెప్పారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీలోనూ చేరే దిశగా దివ్యవాణి అడుగులు వేయలేదు. అయితే, తాజాగా దివ్యవాణి తెలంగాణ రాజకీయాలవైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది.
తెలంగాణ బీజేపీలో చేరేందుకు దివ్యవాణి సుముఖంగా ఉన్నట్టు కనిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో దివ్యవాణి భేటీ కావడం చర్చనీయాంశమైంది. షామీర్ పేటలోని ఈటల నివాసానికి వెళ్లిన దివ్యవాణికి బీజేపీ నుంచి ఆహ్వానం అందిందని తెలుస్తోంది. అయితే, బీజేపీలో చేరతానని ఈటలను దివ్యవాణి స్వయంగా కోరినట్లు మరో పుకారు వినిపిస్తోంది. బీజేపీ అధిష్ఠానంతో చర్చించి ఏ విషయం చెబుతానని ఈటల అన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ బీజేపీకి సినీ గ్లామర్ టచ్ ఇచ్చేందుకు కొంతకాలంగా బీజేపీ ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. అమిత్ షాతో ఎన్టీఆర్, జేపీ నడ్డాతో నితిన్ భేటీ వావడం, జయసుధ కూడా కమలం తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారాల నేపథ్యంలో బీజేపీలో దివ్యవాణి చేరిక ఖాయంగానే కనిపిస్తోంది. ఆల్రెడీ టీడీపీలో మహిళా నేతగా క్రియాశీల పాత్ర పోషించిన దివ్యవాణి…పార్టీ బలోపేతానికి పనికొస్తారన్న భావనలో ఈటల కూడా ఉన్నారట.
Comments 1