విజయవాడలో జనసేన జెండా దిమ్మెలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారన్న ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే వైసీపీ, జనసేన నేతలు, కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది. అయితే, ఈ నేపథ్యంలో జనసేన నేత పోతిన మహేష్ ను పోలీసులు అరెస్టు చేయడం వివాదానికి దారి తీసింది. అధికారిక పార్టీ నేతల ఒత్తిళ్లకు పోలీసులు లొంగిపోయి పోతిన మహేష్ ను అరెస్టు చేశారని జనసేన నేతలు మండిపడుతున్నారు.
అయితే, మహేష్ ను రిమాండ్‌కు పంపే సెక్షన్లు లేనందున 41 A కింద నోటీసు ఇచ్చి పంపాలని పోలీసులకు న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో పోతిన మహేష్‌కు 41A కింద నోటీసు ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మహేష్ అరెస్టును పవన్ తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ దిమ్మలను పగులగొట్టిన వైసీపీ నేతలపై కేసులు ఎందుకు పెట్టలేదని పవన్ నిలదీశారు.
రాష్ట్ర పోలీసుల తీరు మారకపోతే తానే రోడ్డెక్కుతానని గబ్బర్ సింగ్ తరహాలో పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించకూడదనే తాను సంయమనం పాటిస్తున్నానని అన్నారు. జనసేన చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదంటున్నారని, వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని పవన్ ఆరోపించారు.
వైసీపీ నేతలు వాడవాడల్లో పెడుతున్న విగ్రహాలు, జెండా దిమ్మలకు ముందస్తుగా మున్సిపల్, పంచాయతీల అనుమతి తీసుకుంటున్నారా? అని పవన్ ప్రశ్నించారు. వైసీపీ కార్యక్రమాలన్నింటికీ అనుమతులు ఉన్నాయని పోలీసులు చెప్పగలరా అని పవన్ నిలదీశారు. జనసేనను ఎవరూ ఏమీ చేయలేరని, ప్రజలే జనసేనను కాపాడుకుంటారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం శాశ్వతం కాదని, మరో పార్టీ అధికారంలోకి వస్తే పోలీసులు తల దించుకునే పరిస్థితి రాకూడదని హితవు పలికారు.