ఏపీలోని అన్న క్యాంటీన్లపై జగన్ పగబట్టిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను జగన్ మూసివేయించారు. అయితే, అవి మూసివేసినా పర్లేదు…తమ సొంత డబ్బులతో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తామని ముందుకు వచ్చిన టీడీపీ నేతలపై కూడా జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెనాలిలోని అన్న క్యాంటీన్ ను మూసివేసేందుక ప్రయత్నించారు. దీంతో, తెనాలిలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
తెనాలిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గత నెల 12న అన్న క్యాంటిన్ ప్రారంభమైంది. అయితే, ట్రాఫిక్ సమస్యల పేరు చెప్పి క్యాంటీన్ తీసేయాలంటూ 2 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. అయితే, నేడు కూడా నిర్వాహకులు ఆహార పంపిణీ చేపట్టేందుకు ప్రయత్నించడంతో ఆహార పదార్థాలు ఉన్న ఆటోను అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లారు.
దీంతో, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలోనే అక్కడ భారీగా వైసీపీ , టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో, మార్కెట్ సెంటర్లో కర్ఫ్యూ వాతావరణం ఏర్పడింది. అక్కడ పోలీసులు షాపులను మూసి వేయించారు. ఇప్పటికే తెనాలి మార్కెట్ సెంటర్‌కు వెళ్లే మార్గాలు మూసివేశారు. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు.
అన్నం తినే వారెవ్వరూ అన్న క్యాంటీన్‌ను అడ్డుకోరని… జగన్ రెడ్డి తింటుంది ఏంటో ఆయనే తేల్చుకోవాలని లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నందిగామ, మంగళగిరి, కుప్పంలో అడ్డుపడ్డారని… ఇప్పుడు తెనాలిలో అన్న క్యాంటీన్ నిర్వహించకుండా ఆపుతున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి లో మానవత్వం అనేదే లేదా? అని ప్రశ్నించారు. తెనాలిలో అన్న క్యాంటీన్ దగ్గర యుద్ధ వాతావరణాన్ని తలపించేలా పోలీస్ పహారా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా అన్న క్యాంటీన్ నిర్వహిస్తామని, పేదల ఆకలి తీరుస్తామని లోకేష్ స్పష్టం చేశారు.