అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప వ్యవహార శైలిపై టీడీపీ నేతలు చాలాకాలంగా విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న ప్రకాశ్ ను ఫకీరప్ప సస్పెండ్ చేయడం పెను దుమారం రేపింది. సేవ్ ఏపీ పోలీస్ అంటూ జగన్ పర్యటనలో ప్లకార్డు పట్టుకున్నందుకే ప్రకాష్ ను సస్పెండ్ చేశారు. అయితే, గతంలో ప్రకాష్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి ఆయనను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
కానీ, ప్లకార్డు పట్టుకున్నందుకే తనపై కక్ష సాధించారని, తనను డిస్మిస్ చేశారని ప్రకాశ్ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎస్పీ ఫకీరప్ప, ఏఎస్పీ హనుమంతు, డీఎస్పీ మహబూబ్ బాషాలపై అనంతపురం టూటౌన్ పీఎస్ లో ప్రకాశ్ కేసు కూడా పెట్టడం సంచలనం రేపుతోంది. ఆ నలుగురిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులను పోలీసులు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును డీఐజీ రవి ప్రకాశ్ పర్యవేక్షిస్తున్నారు. సాక్షాత్తు జిల్లా ఎస్పీపైనే పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టడం సంచలనంగా మారింది.
మరోవైపు, ఫకీరప్పపై పలు పత్రికలో కథనాలు వచ్చాయి. దీంతో, తనను టార్గెట్ చేస్తూ వార్తలు రాస్తున్నారంటూ ఫకీరప్ప ఈనాడు కార్యాలయానికి వెళ్లారు. సిబ్బందికి ఫకీరప్ప నోటీసులు ఇచ్చారు. తనపై, పోలీసు శాఖపై తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ సిబ్బందిపై చిందులేశారు. ఇక, తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానంగా సోషల్ మీడియాలో ఫకీరప్ప ఓ ఫొటోను షేర్ చేశారు.
కర్ణాటకలోని హవేరీ జిల్లా నెలగోల్ గ్రామం తన సొంతూరని, తన ఊళ్లో తన ఇల్లు ఇదేనని ఆయన ఆ ఫొటోను పోస్ట్ చేశారు. తన గురించి ఆరోపణలు చేస్తున్న వారికి తన ఇంటి ఫొటోతోనే సమాధానం చెబుతున్నానంటూ ఈ ఫొటోను షేర్ చేశారు. తనపై అనుమానం ఉన్న వారంతా ఇది తనదేనని తెలుసుకోవాలి అంటూ ఆయన ఆ ఫొటోకు ఓ కామెంట్ జత చేశారు. అయితే, ఎస్పీగా చాలాకాలంగా పనిచేస్తూ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఫకీరప్ప ఇల్లు ఇదంటే నమ్మబుద్ధి కావడం లేదని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.