సినిమా అనేది ప్రజలపై, వారి జీవితాలపై చాలా ప్రభావం చూపుతుంది. ప్రజలకు మంచి..చెడు సందేశాలివ్వగలక బలమైన వాహకం సినిమా. అందుకే, సినిమాలలో చూపించే విషయాలపై దర్శకనిర్మాతలు, కథా, గేయ రచయితలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక, చరిత్ర, పురాణేతిహాసాలు, మతానికి సంబంధించిన సినిమాలు, బయోపిక్ లు వంటి సున్నితమైన అంశాలతో సినిమాలను రూపొందించాలనుకునేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.
లేదంటే ఆ తరహా సినిమాలపై విమర్శలు రావడం…వివాదాలలో చిక్కుకోవడం వంటి పరిణామాలు ఈ మధ్యకాలంలో చాలానే జరిగాయి. దీపికా పదుకొణే నటించిన పద్మావత్ మొదలు మొన్న మొన్నటి కశ్మీర్ ఫైల్స్ వరకూ చాలా సినిమాలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాయి.
ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రామసేతు’ సినిమా కూడా చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రంలో వాస్తవాలను వక్రీకరించారంటూ ఆ చిత్ర యూనిట్ లో 8 మందికి బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి లీగల్ నోటీసులు పంపించడం సంచలనం రేపింది. ఈ చిత్ర హీరో అక్షయ్ కుమార్ తోపాటు, సినిమాకు సంబంధించిన మరో ఎనిమిది మందికి తాను లీగల్ నోటీసులు పంపించానని స్వామి స్వయంగా తన ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేశారు. మేథో సంపత్తి హక్కుల గురించి వారికి తెలియజేసేందుకే తాను అలా చేసినట్టు స్వామి చెప్పుకొచ్చారు. వాస్తవాలను వక్రీకరించడం హిందీ సినిమాకు అలవాటుగా మారిందని స్వామి షాకింగ్ కామెంట్లు చేశారు.
స్వామి తరఫున ఆ 8 మందికి న్యాయవాది సత్య సబర్వాల్ లీగల్ నోటీసులు పంపారు. ‘‘నా క్లయింట్ 2007లో రామసేతు పరిరక్షణ గురించి సమర్థవంతంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రామసేతుకు నష్టం కలిగించే సేతు సముద్రం షిప్ కెనాల్ ప్రాజెక్టును వ్యతిరేకించారు. దీనిపై సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసి ఉంది. రామసేతును రక్షించడమే ఇందులోని అంతర్భాగం. సినిమాలోనూ దీన్నే చూపించినట్టు అయితే నా క్లయింట్ ఈ విషయంలో సహకారం అందించేవారు’’ అని ఆ నోటీసుల్లో సత్య పేర్కొన్నారు.
సినిమా స్క్రిప్ట్, దృశ్యాలను తన క్లయింట్ తో పంచుకోవాలని, అప్పుడే ఎటువంటి వక్రీకరణ, అవాస్తవాలకు అవకాశం ఉండదని సత్య అన్నారు. దీంతో, ఆ చిత్ర బృందం చిక్కుల్లో పడినట్లయింది. మరి, ఆ నోటీసులపై అక్షయ్ కుమార్ తో పాటు చిత్ర యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుష్రత్ భూరూచ నటించిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ చివర్లో విడుదల కానుంది.
a6tjr0