ఒకటి తర్వాత ఒకటి చొప్పున తాము టార్గెట్ చేసిన లక్ష్యాల్ని పూర్తి చేయటం చాలామంది చేస్తుంటారు. అందుకు భిన్నంగా ఒక్కసారిగా విరుచుకుపడే దూకుడు వ్యూహాన్ని అమలు చేస్తోంది బీజేపీ అధినాయకత్వం. దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న చోట అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఇదంతా చూస్తే.. రానున్న కొద్ది నెలల్లో బీజేపీ భారీ టార్గెట్ పెట్టుకుందన్న భావన కలుగక మానదు. ఇప్పటికే దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ.. తాను అధికారంలో లేని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు షాకుల మీద షాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఒకేసారి తన రాజకీయ ప్రత్యర్థులందరిని ఉరుకులు పెట్టించేలా పావులు కదుపుతోంది. అందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏళ్లకు ఏళ్లు ఆయా పార్టీల్లో సీనియర్ నేతలుగా ఉన్న వారు.. అకస్మాత్తుగా ఏదో కారణం చూపించి పార్టీకి గుడ్ బై చెబుతున్న వైనాలు పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి పరిణామామే త్రిపురలో చోటు చేసుకుంది. అక్కడి అధికార టీఎంసీకి చెందిన సీనియర్ పార్టీ నేత అబ్దుల్ బాసిన్ ఖాన్ తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.
టీఎంసీ త్రిపుర యూనిట్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన.. తన రాజీనామా లేఖను రాష్ట్ర ఇన్ ఛార్జ్ కు అందించారు. ఈ పరిణామం మమతకు భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. పార్టీ ఉపాధ్యక్ష పదవికి సైతం ఆయన గుడ్ బై చెప్పేశారు. మరో ఆరు నెలల్లో త్రిపురలో ఎన్నికలు జరిగే సమయంలో ఈ రాజకీయ పరిణామం హాట్ టాపిక్ గా మారింది.
టీఎంసీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సుబల్ భౌమిక్ ను టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తొలగించిన కొంతకాలానికే పార్టీకి కీలకమైన బాసిత్ ఖాన్ రాజీనామా చేయటం షాకింగ్ గా మారింది. ఎలాంటి కారణాలు చెప్పకుండా సుబల్ భౌమిక్ ను పార్టీ అత్యున్నత స్థానం నుంచి తొలగిస్తే.. సరైన కారణం ఏమీ చెప్పకుండానే తాజాగా బాసిన్ ఖాన్ పార్టీకి రాజీనామా చేయటం ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది.