రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని రూపంలో విరాళాలు అందించే వైనం గురించి తెలిసిందే. అయితే.. ఇలా తెలీకుండా విరాళాలు అందించే మొత్తాలు ఎంత భారీగా ఉంటాయన్నవిషయంలో పాటు.. ఇలాంటి విరాళాలు ఎక్కువగా వచ్చే పార్టీలు ఏమేమిటి? అన్న అంశంపై కొత్త వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తాజాగా వెల్లడించింది.
2004-05 నుంచి 2020-21 మధ్యలో జాతీయ పార్టీలకు వచ్చిన గుప్త నిధులు రూ.15,077 కోట్లుగా పేర్కొంది. ఒక్క 2020-21 ఒక్క ఏడాదిలోనే జాతీయ.. ప్రాంతీయ పార్టీలకు కలిపి రూ.690 కోట్లకు పైగా గుప్త నిధులు వచ్చినట్లుగా వెల్లడించారు. గుప్త నిధులు అందుకున్న పార్టీలకు సంబంధించి 8 జాతీయ పార్టీలు.. 27 ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన ఏడీఆర్ లను పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేపట్టారు.
అధ్యయనం జరిగిన 8 జాతీయ పార్టీలు ఏవంటే..
– బీజేపీ
– కాంగ్రెస్
– టీఎంసీ
– సీపీఎం
– సీపీఐ
– ఎన్సీపీ
– బీఎస్పీ
– నేషనల్ పీపుల్స్ పార్టీ కాగా.. 27 ప్రాంతీయ పార్టీల వివరాల్ని కూడా తీసుకున్నారు. వాటిల్లో ముఖ్యమైన ప్రాంతీయ పార్టీల్ని చూస్తే..
– ఆమ్ ఆద్మీ పార్టీ
– అన్నాడీఎంకే
– మజ్లిస్
– బీజేడీ
– డీఎంకే
– జేడీయూ
– జేడీఎస్
– శివసేన
– టీడీపీ
– టీఆర్ఎస్
– వైసీపీ తదితర పార్టీలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. గుర్తు తెలియని వారు ఇచ్చే గుప్త విరాళాలకు సంబంధించి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో నిలిస్తే.. ప్రాంతీయ పార్టీల్లో ఏపీ అధికారపక్షం వైసీపీ నిలిచింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీకి రూ.178.78 కోట్ల గుప్త నిధులు రాగా.. బీజేపీకి రూ.100.5 కోట్లు వచ్చినట్లుగా గుర్తించారు. జాతీయ పార్టీలకు సంబంధించి వచ్చిన మొత్తం గుప్త విరాళాల్లో కాంగ్రెస్ కు వచ్చిన విరాళాలే 41.8 శాతం కావటం విశేషం.
ఇదే కాలానికి ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే.. ఐదు పార్టీలకు అత్యధిక విరాళాలు వచ్చినట్లుగా గుర్తించారు. వైసీపీ 96.25 కోట్లతో టాప్ ప్లేస్ లో నిలవగా.. డీఎంకేకు రూ.80.02 కోట్లు.. బీజేడీకి రూ.67 కోట్లు.. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.5.4 కోట్లు వచ్చినట్లుగా గుర్తించారు.