ఏపీని జగన్ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసిన సంగతి తెలిసిందే. అందిన కాడికి అప్పులు చేయడం…అప్పు దొరకకపోతే వేరే శాఖలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించడం జగన్ కు పరిపాటిగా మారిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే, జగన్ తీరు మాత్రం మారడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా గ్రామపంచాయతీలకు కేటాయించిన నిధులను జగన్ పక్కదారి పట్టించిన వైనం తీవ్ర చర్చనీయాంశమైంది.
గ్రామ పంచాయతీల పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతాల్లోనే ఆర్థిక సంఘం నిధులను జమ చేయాలన్న కేంద్రం ఆదేశాలను జగన్ సర్కార్ లెక్కచేయలేదు. దాదాపు రూ.379 కోట్ల నిధులను పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్రం కేటాయించింది. అయితే, మరోసారి ఈ నిధులను పీడీ ఖాతాలో జమచేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని పంచాయతీలు చెల్లించాల్సిన విద్యుత్తు ఛార్జీల బకాయిల కింద విద్యుత్తు పంపిణీ సంస్థలకు మళ్లించాలని ఫిక్సయంది.
ఈ క్రమంలోనే ఆ నిధులను బ్యాంకు ఖాతాలకు బదులుగా పీడీ ఖాతాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాదు, 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల ప్రక్రియకు సంబంధించిన జీవోలు 3591, 3628లో కూడా నిధుల మళ్లింపునకు అనుగుణంగా సవరణలు చేస్తున్నట్లు ఏకంగా మెమో కూడా ఆర్థిక శాఖ జారీ చేసింది. ఈ పరిణామాలతో రాష్ట్రంలోని సర్పంచులు మరోసారి షాకయ్యారు. ఆల్రెడీ 14వ, 15వ ఆర్థిక సంఘం నిధుల్లో నుంచి రూ.1,244 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించడంతో మొదటిసారి సర్పంచులు షాక్ కు గురయ్యారు.
వారంతా కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో పంచాయతీల పేరుతో ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిపించాలని కేంద్రం ఆదేశించింది. దీంతో, తాజాగా కేంద్రం కేటాయించిన రూ.379 కోట్లు పంచాయతీ బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని ఎదురుచూస్తున్న సర్పంచులకు నిరాశే ఎదురైంది. ఇటువంటి క్రమంలోనే సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఈ నిర్ణయాన్ని జగన్ సర్కార్ వెనక్కు తీసుకోపోతే కోర్టుకు వెళతామని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్, సర్పంచులు వార్నింగ్ ఇస్తున్నారు.
Comments 1