అతి తక్కువ కాలంలో దేశీయ కుబేరుడిగా మాత్రమే కాదు.. ప్రపంచ కుబేరుల స్థానంలోనూ తన చోటును సొంతం చేసుకున్న వ్యాపారవేత్తగా నిలుస్తారు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ. అది.. ఇది అన్న తేడా లేకుండా తనకు ఏ మాత్రం సంబంధం లేని వ్యాపారాల్లో కాలు పెట్టేస్తున్న ఆయన తాజాగా మీడియా మీద కన్ను పడింది. ప్రముఖ మీడియా సంస్థ ఎన్ డీటీవీని సొంతం చేసుకోవటానికి తమ ప్లాన్ ను వెల్లడించిన వైనం ఇప్పుడు ఆయన హాట్ టాపిక్ గా మారారు. ఎన్ డీ టీవీ కొనుగోలు నిర్ణయంతో ఆయన అచ్చం ముకేశ్ అంబానీ బాటలో పయనిస్తున్నట్లుగా చెప్పాలి.
ఎందుకంటే..కొంతకాలం క్రితం బ్రాడ్ కాస్టింగ్ సంస్థ నెట్ వర్క్ 18 ను సొంతం చేసుకున్న ముకేశ్ మాదిరి.. తాజాగా గౌతమ్ అదానీ ‘ఎన్ డీ టీవీ’ని సొంతం చేసుకోవటానికి పావులు కదుపుతున్నారు. వార్తా చానళ్ల మీడియా సంస్థ అయిన న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ లో మెజారిటీ వాటాను సొంతం చేసుకోవటానికి వీలుగా అదానీ సిద్ధమైంది. సాధారణ వాటాదారుల నుంచి 26 శాతం వాటాను కొనుగోలు చేయటానికి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది.
దీని కోసం రూ.4 ముఖ విలువ కలిగిన షేరుకు రూ.294 ధరను డిసైడ్ చేసింది. మొత్తం 1.68 కోట్ల షేర్లను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. దీని కోసం రూ.493 కోట్లను ఖర్చు చేయనుంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల కంటే కూడా తాము ఆఫర్ చేసిన ధర అధికమని కంపెనీ స్పష్టం చేసింది. సోమవారం నాటికి షేరు ముగింపు ధర రూ.353 కాగా.. తాజా వార్తల నేపథ్యంలో ఈ షేరుకు భారీ డిమాండ్ నెలకొంది. తాజాగా క్లోజింగ్ ధర 52 వారాల గరిష్ఠం మాత్రమే కాదు.. ఓపెన్ ఆఫర్ ధర కంటే 28 శాతం అధికం కావటం గమనార్హం.
ఎన్ డీటీవీ వారంట్ల మార్పిడి ద్వారా అదానీ గ్రూప్ దాదాపు 30 శాతం వాటాను సొంతం చేసుకుంది. దీంతో.. పబ్లిక్ నుంచి మరో 26 శాతం వాటా కొనుగోలుకు ఓపెన్ ఆఫర్ ద్వారా సమీకరించాలని భావిస్తోంది. అదానీ అనుకున్నట్లే జరిగితే.. ఎన్ డీటీవీలో 55 శాతం వాటా అదానీ గ్రూప్ సొంతమవుతుంది. అదే జరిగితే.. ఎన్ డీ టీవీలో నిర్ణయాధికారం అదానీ చేతుల్లోకి వస్తుంది. ఇక్కడో ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాలి. ఎన్ డీ టీవీ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్.. రాధికా రాయ్ లకు కలిపి సంస్థలో 32.26 శాతం వాటా ఉంది.
ఓపెన్ ఆఫర్ ద్వారా 26 శాతం వాటాకు సమానమైన షేర్లను అదానీ సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ఈ మధ్యన అదానీ గ్రూప్ రూ.114 కోట్లతో కొనుగోలు చేసిన వీసీపీఎల్ సంస్థ గతంలో ముకేశ్ అంబానీ గ్రూప్ కు చెందిన సంస్థ కావటం గమనార్హం. మొత్తానికి తాను అనుకున్న కంపెనీల్ని కొనుగోలు చేస్తున్న అదానీ ప్రయాణం మున్ముందు ఎలా సాగుతుందన్నది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Comments 1