దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ల నట విశ్వరూపానికి జనమంతా ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో తారక్, చెర్రీల నటనపై బాలీవుడ్ మీడియానే కాదు హాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే, ఈ చిత్రంపై ఫిలిం క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఆ సినిమా బాగోలేదంటూ కమల్ షాకింగ్ కామెంట్స్ చేయడం గతంలో చర్చనీయాంశమైంది. ఇక, ఈ సినిమా గే సినిమాలా ఉందంటూ ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పొకుట్టీ చేసిన కామెంట్లు కూడా దుమారం రేపాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ జాబితాలో టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేరారు. ఆర్ఆర్ఆర్ సినిమా తనకు ఒక సర్కస్ లా అనిపించిందని ఆర్జీవీ షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ సినిమాలో వంతెన దగ్గర పిల్లవాడిని కాపాడే సీన్ చూస్తున్నప్పుడు తనకు సర్కస్ చూసిన ఫీలింగ్ కలిగిందని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ ఫిలిం మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కాలేజీ రోజులలో తనకు కమ్యూనిస్టు భావజాలం ఉండేదని, అయితే అయాన్ రాండ్ పుస్తకాలు చదవడం మొదలుబెట్టిన తర్వాత తనలో మార్పు వచ్చిందని వర్మ అన్నారు. తనతో సహా తాను ఏ విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకోనని వర్మ తన మార్క్ కామెంట్లు చేశారు. తన మొత్తం కెరీర్లో కేవలం క్షణక్షణం, సర్కార్ సినిమాలను మాత్రమే ఆ స్క్రిప్ట్ కు సరిపోయే నటీనటులతో తీశానని అన్నారు.
మిగతా సినిమాలన్నీ ఫలానా నటులు చేయాలని అనుకోలేదని వెల్లడించారు. ఇక స్క్రీన్ పై అమ్మాయిలను తనకంటే అందంగా మరెవరు చూపించలేరని వర్మ తనను తాను మెచ్చుకున్నాడు. మణిరత్నం సినిమాలంటే తనకు చిరాకని, ఒకసారి తామిద్దరం కూర్చుంటే ఆయన మాట తాను వినలేదని, తన మాట ఆయన వినలేదని చెప్పుకొచ్చారు వర్మ. ఏది ఏమైనా ఆర్ఆర్ఆర్ సినిమా ఒక సర్కస్ అంటూ వర్మ చేసిన షాకింగ్ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Comments 1