- ఏ లక్ష్యంపైకి ఈ బాణం దూసుకెళ్లనుంది?
- రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు
- సంబంధం లేదని చేతులు దులుపుకొన్న జగన్
- వైసీపీ నేతల్లో మాత్రం గుబులు
- జగన్ వ్యక్తిగత ‘ఇమేజ్’కు ఇది దెబ్బే
- సొంత చెల్లెలికే న్యాయం చేయలేదనే ‘మరక’
రాజన్న రాజ్యం తెలంగాణలో కూడా తీసుకురావడానికి ఆంధ్ర సీఎం జగన్మోహన్రెడ్డి చెల్లెలు, దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్దులపట్టి షర్మిల రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు నిర్ధారణైంది. 2-3 నెలలుగా దీనిపై మంతనాలు జరుపుతున్న ఆమె.. ఈ నెల 9న హైదరాబాద్ లోటస్పాండ్ నివాసంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఆ జిల్లాకు చెందిన వైసీపీ నేతలు సైతం దీనికి హాజరవడంతో ఈ మొత్తం వ్యవహారం వెనుక జగన్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
షర్మిల పార్టీపై రాజకీయ వర్గాల్లోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ ‘జగనన్న వదిలిన బాణం’లా ఉన్న ఈమె.. తానే విల్లు ఎక్కుపెట్టాలని అనుకుంటున్నారు. ఆమె వదిలే బాణం టార్గెట్ ఏమిటో విశ్లేషకులు రకరకాల వివరణలు ఇస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల సరళి చూశాక.. తెలంగాణలో ప్రధానమైన రెడ్డి సామాజిక వర్గం క్రమేణా బీజేపీ వైపు మరలుతోందని ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ అంచనా వేశారని.. దానిని నిలువరించాలంటే వైసీపీని తెలంగాణలో విస్తరింపజేయాలని భావించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే బీజేపీని నేరుగా టార్గెట్ చేస్తే.. తనకే ప్రమాదమని.. అక్రమాస్తుల కేసుల్లో ప్రథమ నిందితుడైన జగన్ భావించారని.. అందుకే తన బదులు తన చెల్లెలిని తెలంగాణలో రంగంలోకి దించారని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
అక్రమాస్తుల కేసుల్లో రేపు జైలుకెళ్తే భార్యకు, చెల్లెలికి మధ్య అధికార పదవులపై విభేదాలు తలెత్తకుండా.. చెల్లెలిని తెలంగాణకే పరిమితం చేయాలని జగన్ అనుకుంటున్నట్లు ఇంకొందరు చెబుతున్నారు. ఇవేమీ కాదు.. కాంగ్రెస్ను అక్కడ సంపూర్ణంగా నిర్వీర్యం చేసి.. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు బీజేపీ రచించిన వ్యూహంలో షర్మిల పార్టీ భాగమని మరికొందరు వాదిస్తున్నారు.
రెడ్డి సామాజిక వర్గం నేతలను బీజేపీలోకి గానీ, షర్మిల పార్టీలోకి గానీ తీసుకుంటే టీఆర్ఎస్లో ఉన్న నేతలు కూడా తమ వైపు వస్తారని కమలనాథులు అంచనా వేస్తున్నారని.. అప్పుడు కాంగ్రెస్తో పాటు టీఆర్ఎస్ బలమూ క్షీణించి అధికారం తమ హస్తగతమవుతుందని విశ్లేషిస్తున్నారని అంటున్నారు. ఈ వాదనల్లో దేనినీ కొట్టివేయలేని పరిస్థితి.
ఓ పక్క లోటస్పాండ్లో షర్మిల సమావేశం నడుస్తుండగానే.. వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హడావుడిగా మీడియా ముందుకు వచ్చి.. ఈ వ్యవహారంతో జగన్కు సంబంధం లేదని వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ తెరచాటు వ్యవహారాలు ఎలా ఉన్నా.. అన్నాచెల్లెళ్ల నడుమ విభేదాలు ఉన్నాయని బట్టబయలు కావడంతో ఆంధ్రలోని వైసీపీ నేతల్లో ఆందోళన ఏర్పడింది. విభేదాలు పెద్దవై.. వచ్చే ఎన్నికల్లో ఆమె ఆంధ్రలోనూ కాలుపెడితే పరిస్థితి ఏమిటన్నది వారికి అంతుపట్టడం లేదు.
తేలిపోయిన సజ్జల వాదన..
‘తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఫిబ్రవరి 9వ తేదీనే షర్మిల తొలి అడుగు వేయనున్నారు’ అని ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన కథనం అక్షరసత్యమైంది. దీనిని ఆ పత్రికలో ప్రచురించినప్పుడే వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. షర్మిల తెలంగాణలో ఎందుకు పార్టీ పెడుతున్నారంటూ ఆరాలు తీయడం ప్రారంభించారు.
తెలంగాణలో రాజశేఖరరెడ్డి అభిమానులు అత్యధికంగా రెడ్డి కులస్తులు, క్రిస్టియన్లు, ఎస్సీ, ఎస్టీ వర్గాలలో ఉన్నారని.. వారందరికీ ఒక వేదికగా షర్మిల పార్టీ నిలుస్తుందని చెబుతున్నారు. షర్మిల పార్టీ వల్ల పరోక్షంగా టీఆర్ఎస్కు లబ్ధి చేకూరుతుందని.. ఇది కూడా రాజకీయ ప్రణాళికలో భాగమేనని భావిస్తున్న రాజకీయ విశ్లేషకులూ ఉన్నారు.
జగన్ రాజకీయ లాలూచీలను ప్రోత్సహిస్తున్నారని.. షర్మిల పార్టీ అంశమే ప్రత్యక్ష ఉదాహరణ అనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో వైసీపీ నేతలు మాత్రం మొదటి నుంచీ ‘మౌన వ్యూహం’ అనుసరించారు. ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దంటూ పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వెళ్లిపోయాయి. రాజకీయంగా లోపాయకారీ ఒప్పందాలు ఎన్ని ఉన్నా… షర్మిల రాజకీయ పార్టీతో వైఎస్ జగన్ వ్యక్తిగత ‘ఇమేజ్’కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఆయన తన సొంత చెల్లెలికే న్యాయం చేయలేదనే సంకేతాలు ప్రజల్లోకి బాగా వెళ్లాయని చెబుతున్నాయి. ‘అక్రమాస్తుల కేసులో జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. నేను జగనన్న వదిలిన బాణాన్ని అని ప్రతి వేదికపైనా చాటి చెప్పారు. పాదయాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
2019 ఎన్నికల్లోనూ కీలకమైన నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి.. జగన్ సీఎం అయ్యాక.. షర్మిల మళ్లీ ఎక్కడా కనిపించలేదు. చెల్లెలికి జగన్ న్యాయం చేయలేదని, ఆమెకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని వైసీపీ ముఖ్యనేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు షర్మిల ప్రత్యేక పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయం వెనుక… సొంత అస్తిత్వాన్ని, బలాన్ని చాటుకోవాలనే లక్ష్యముందని వారిలో కొందరు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీలో అప్పుడెప్పుడో జరిగిన అధికార మార్పిడిని అస్త్రంగా చేసుకుని చంద్రబాబును వైసీపీ నేతలు ఇప్పటికీ విమర్శిస్తున్నారు. ఇప్పుడు షర్మిలకు జగన్ చేసిన అన్యాయాన్ని అస్త్రంగా చేసుకుని ఇతర పార్టీల వారు విమర్శించడం మొదలవుతుందని ఆందోళన చెందుతున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే.. షర్మిలను రాజ్యసభకు పంపి ఉంటే.. కుటుంబ నేపథ్యంతో నిమిత్తం లేకుండా తనను నమ్ముకున్న వారికి జగన చేయూత ఇస్తారన్న అభిప్రాయం కలిగేదని వారు చెబుతున్నారు. సొంత చెల్లెలిని కూడా జగన్ మోసం చేశారనే విమర్శలకు ఇప్పుడు తావిచ్చినట్లయిందని పేర్కొంటున్నారు. మీడియా ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన వివరణ.. పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువ చేసిందని చెబుతున్నారు.
షర్మిల పార్టీ పెడుతున్నందుకు జగన బాధపడుతున్నారంటూనే.. అన్నగా ఆమెకు ఆశీస్సులు ఉంటాయని చెప్పడం మరింత చిత్రంగా ఉందని పేర్కొంటున్నారు. విషయాన్ని ‘తేలిక’ పరిచే ప్రయత్నం చేసినప్పటికీ, సజ్జల మాటల్లోనూ అసలు విషయం దాగలేదు. ఇద్దరి మధ్య విభేదాలు నిజమని, దీనివల్లే అన్న జగన్ వద్దన్నా, తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల ముందుకే వెళ్లారని పరోక్షంగా అంగీకరించినట్లయింది.
మీడియా సమావేశంలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. పలు సందర్భాల్లో ఆయన తడబడటం స్పష్టంగా కనిపించింది. ఈ పరిణామాలతో వైసీపీ వర్గాల్లో కొంత కలవరం, మరికొంత గుబులు మొదలయ్యాయి. సజ్జల మేకపోతు గాంభీర్యాన్ని మాత్రమే ప్రదర్శించారని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలున్నాయని, అది కూడా ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లయిందని వైసీపీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలతో.. సొంత కుటుంబ సభ్యులను జగన దూరం చేసుకున్నారన్న దుమారం రేగుతోంది.