ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించిన ఘటన దేశ రాజకీయాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో సిసోడియా నివాసంలో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించడం కలకలం రేపింది. మద్యం షాపుల లైసెన్సులు, మద్యం దుకాణాల ప్రైవేటీకరణ, టెండర్ల వ్యవహారంలో కోట్ల రూపాయలు ముడుపులను తీసుకున్నారని సిసోడియాపై ఆరోపణలు వస్తున్నాయి.
లైసెన్సీలకు కోట్ల రూపాయలు లాభం చేకూర్చేలా ఎక్సైజ్ నిబంధనలకు మార్పులు చేర్పులు చేశారని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ వ్యవహారంలో సిసోడియాటు గతంలో ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ గా పనిచేసిన తెలుగు ఐఏఎస్ అరవ గోపీ కృష్ణపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇక, ఈ మధ్య కుంభకోణంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. మాగుంటతో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నాయకులు ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నారని తెలుస్తోంది.
ఢిల్లీలోని మరో కంపెనీతో కలిసి లిక్కర్ కార్టల్ గా ఏర్పడి ఈ మద్యం కుంభకోణంలో మాగుంట కంపెనీలు భాగస్వాములయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సిసోడియాకు, ఎక్సైజ్ అధికారులకు ఈ కార్టెల్ భారీ స్థాయిలో ముడుపులు చెల్లించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే సిసోడియా నివాసంలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ వ్యవహారంలో త్వరలోనే మాగుంటతోపాటు, కొందరు టీఆర్ఎస్ నేతలను కూడా సీబీఐ అధికారులు విచారణ జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అంతేకాదు, త్వరలోనే వారి పేర్లు కూడా అధికారికంగా వెల్లడించే దిశగా అధికారులు ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, బ్లాక్ లిస్టులో ఉన్న మాగుంటకు చెందిన కంపెనీలకు లైసెన్సులు కేటాయించడం, బిడ్డింగ్ లో పాల్గొనేలా అవకాశం కల్పించడంతో ఢిల్లీ సర్కార్ పై గతంలోనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ సెగ ఏపీకి తగిలినట్లయింది.
Comments 1