వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. గోరంట్ల వీడియో ఒరిజినల్ అని తేలినా సరే అది ఫేక్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆ విమర్శలపై గోరంట్ల మాధవ్ స్పందించారు. అది ఫేక్ వీడియో అని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలిందని, అయినా సరే దానిని పట్టుకుని టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని గోరంట్ల అన్నారు.
అది ఫేక్ వీడియో అని తాను కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని, ఓటుకు నోటు ఆడియో తనది కాదని చంద్రబాబు ప్రమాణం చేస్తారా అని గోరంట్ల సవాల్ విసిరారు. అలా చేసిన వెంటనే తన రాజీనామా లేఖను చంద్రబాబుకు అక్కడే సమర్పిస్తానని ఛాలెంజ్ చేశారు. గతంలో, మహిళలపై కామెంట్లు చేసిన బాలకృష్ణపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని గోరంట్ల ప్రశ్నించారు.
మహాభారతంలో కూడా ముందుగా దుర్యోధనుడు గెలిచాడని, చివరికి ధర్మం, పాండవులు గెలిచారంటూ పురాణాలను టచ్ చేశారు గోరంట్ల. మహాభారతంలో మాదిరిగానే ఇక్కడ కూడా చివరికి విజయం తనదేనని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. ఫేక్ వీడియోలు తెచ్చి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫేక్ వీడియోతో బీసీ ఎంపీల అయిన తనపై విష ప్రచారం చేసి వేధిస్తున్నారని మరోసారి కులం కార్డు అడ్డుపెట్టుకున్నారు గోరంట్ల.
ఒకవేళ, ఆ వీడియోలో ఉన్నది తానని తేలితే ఎంపీ పదవి రాజీనామా చేసినందుకు సిద్ధమని మరో సవాల్ విసిరారు. తన ఫేక్ వీడియోపై ఏపీ డీజీపీకి కూడా ఫిర్యాదు చేశానని గోరంట్ల అన్నారు. అంతేకాదు, ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో కూడా తానే విజయం సాధిస్తానని మాధవ్ ధీమా వ్యక్తం చేయడం విశేషం.