సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ నేతలు కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ టీడీపీ అధినేత అచ్చెన్నాయుడు మొదలుకొని మొన్న ధూళిపాళ నరేంద్ర వరకు తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతలు, కార్యకర్తలను జగన్ అరెస్ట్ చేయించారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోని తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బెందాళం అశోక్ ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది.
మంత్రి సీదిరి అప్పలరాజుపై విమర్శలు చేశారన్న అక్కసుతోనే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సూర్యనారాయణకు చెందిన నాలుగు ఇళ్లతోపాటు పలువురు టీడీపీ కార్యకర్తల ఇళ్లను టార్గెట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలకు చెందిన 52 ఇళ్లను కూల్చేస్తున్నారన్న సమాచారంతో అశోక్ అక్కడికి వెళ్లారు. అయితే, అప్పటికే ఆ ఇళ్లను కూల్చేందుకు రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. చెరువు గర్భంలో అక్రమంగా నిర్మాణాలు జరిపారని, వాటిని తొలగించేందుకు వచ్చామని అధికారులు చెబుతున్నారు.
ఇళ్ల కూల్చివేతకు రావడానికి నిరసనగా టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ఆ నిరసనకు దిగిన టీడీపీ నేతలకు మద్దతుగా ఎమ్మెల్యే బెందాళం అశోక్ నిలిచారు. దీంతో, అశోక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులను మోహరించారు.
దీంతో, టీడీపీ ఎమ్మెల్యే అశోక్ పై పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ పలాసలో టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పలాసలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. అశోక్ అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ లు ఖండించారు.
Comments 1