ఏపీ సీఎం జగన్ ‘రెడ్డి’ పాలనలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీని అధికారపక్షం టార్గెట్ చేయడం రాజకీయాల్లో సహజం. కానీ, ప్రతిపక్ష పార్టీలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం మాత్రం ఒక్క జగన్ పాలనలోనే జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. సీఎం కాగానే కమ్మ సామాజిక వర్గంపై జగన్ కక్ష సాధింపులకు దిగారని టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
అయినా, జగన్ తీరు మారలేదు. అంతేకాదు, తనను, తన పార్టీలోని నేతలను విమర్శించే వారికి కులం రంగు పులమడం జగన్ కు అలవాటైందన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా తమ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలన రేపుతుంటే చివరకు ఆ ఎపిసోడ్ కు కూడా జగన్ అండ్ కో కులం రంగు ఆపాదించి టాపిక్ ను డైవర్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ కుల రాజకీయాలపై జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని, ఆ కారణంతో తనకు జగన్ కులం రంగు పులుముతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడేవారికి తాను అదే రీతిలో జవాబు చెప్పగలనని పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఇక, వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి అక్కడ ఏం చేస్తారన్న సంగతి తనకు బాగా తెలుసని, ప్రధాని మోడీ ముందు వైసీపీ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరని పవన్ ఎద్దేవా చేశారు. జగన్ లాగా తాను కేసులకు భయపడే వ్యక్తిని కాదని పవన్ అన్నారు.
రాబోయే ఎన్నికల్లో జనసేన విజయం సాధిస్తే అన్ని వ్యవస్థలు బలోపేతం అవుతాయని పవన్ ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మార్పు రావాలని ఆ మార్పు తెచ్చేందుకు ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలని, ఆ దిశగా ప్రజలు ఆలోచన చేయాలని పవన్ పిలుపునిచ్చారు. అలా కాకుండా ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలో మార్పులు రావని పవన్ అన్నారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. జనసేన అధికారంలోకి రాగానే అందరూ లెక్క తేలుస్తామని పవన్ వార్నింగ్ ఇచ్చారు. అందిన చోటల్లా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని జగన్ గొప్పగా చెప్పుకుంటున్నారని పవన్ ఎద్దేవా చేశారు. ఉపాధి కరువై రాష్ట్ర ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, కానీ సంక్షేమ పథకాల పేరుతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పూర్తిగా జగన్ నిర్వీర్యం చేశారని పవన్ మండిపడ్డారు.
గుడివాడలో ఇసుక దందా జోరుగా సాగుతుందని కొడాలి నానిపై పరోక్షంగా పవన్ విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లాలో జనసేన నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనకు పదవులపై వ్యామోహం లేదని, ఒకవేళ తాను పదవులకు ఆశపడే వాడినే అయితే 2009లోనే ఎంపీ అయ్యే వాడినని పవన్ చెప్పుకొచ్చారు. పార్టీని నడిపే సత్తా ఒక వైసీపీకే ఉందా అని పవన్ ప్రశ్నించారు. 2024 ఎన్నికలలో జనసేనకు ప్రజలంతా మద్దతునివ్వాలని పవన్ కోరారు.