తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపుతో బిజేపీకి కొత్త ఊపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా బిజేపీ హవా కొనసాగడంతో రాష్ట్రంలో ఆ పార్టీ బలపడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పై బిజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సందర్భానుసారంగా విమర్శలు గుర్తిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్, బిజేపీ నేతలు, కార్యకర్తల మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్…కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఉద్యోగాలివ్వకుండా యువకులను మోసం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో బిజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. బిజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. అంతేకాదు, పాదయాత్ర జరుగుతున్న ప్రదేశం నుంచే తెలంగాణ డిజీపీ మహేందర్ రెడ్డికి బండి సంజయ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇద్దరు బిజేపీ కార్యకర్తలకు తల పగిలిందని, వారిపై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్తపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే ఆ ఇద్దరినీ తీసుకొని డీజీపీ ఆఫీసుకు వస్తానని బండి సంజయ్ హెచ్చరించారు.
అంతేకాదు, అక్కడికి ముఖ్యమంత్రిని కూడా రమ్మనండి అంటూ డీజీపీతో ఆవేశంగా మాట్లాడారు. మరో సంవత్సరం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండదని డీజీపీతో బండి సంజయ్ అన్నారు. ప్రశాంతంగా కొనసాగుతున్న పాదయాత్రలో టీఆర్ఎస్ కార్యకర్తలు అలజడి రేపారని, వారిని నియంత్రించి శాంతి భద్రతలను కాపాడాలన్న ఆలోచన పోలీసులకు ఉన్నట్లు కనిపించడం లేదని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గొడవ జరుగుతుంటే సీపీ ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments 1