ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్ మార్కెట్ లో బిగ్ బుల్ గా పేరున్న రాకేష్ ఝున్ ఝున్ వాలా ఈ రోజు తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు ఆదివారం తెల్లవారుజామున రాకేష్ కు గుండెపోటు రావడంతో ఆయనను ముంబైలోని బీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాకేష్ 15 రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అయితే, ఈరోజు తెల్లవారుజామున ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రిలో వైద్యులు ఆయనను బతికించడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రాకేష్ మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీతోపాటు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
సాధారణ ప్రజలకు రాకేష్ పేరు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈయన సుపరిచితుడే. దలాల్ స్ట్రీట్ లో బిగ్ ఫుల్ గా పేరున్న రాకేష్ ఝున్ ఝున్ వాలా యువకుడిగా ఉన్నప్పుడే ఆయన తండ్రి నుంచి స్టాక్ మార్కెట్ పాఠాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానంటూ తన తండ్రిని అడిగితే ఆయన డబ్బులు ఇవ్వలేదు. దీంతో తన స్నేహితుల దగ్గర 5000 రూపాయలు అప్పుచేసి మరీ స్టాక్ మార్కెట్లో రాకేష్ పెట్టుబడిగా పెట్టారు.
తన తెలివితేటలు, వ్యూహాలతో అంచెలంచెలుగా దలాల్ స్ట్రీట్ లో ఎదిగిన రాకేష్ నేడు భారత వారన్ బఫెట్ గా ఎదిగారు. పోర్బ్స్ జాబితా ప్రకారం భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో రాకేష్ ది 48వ స్థానం. కేవలం 5000 పెట్టుబడితో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన రాకేష్ 2022 జూలై నాటికి 40 వేల కోట్ల ఆస్తిని సంపాదించారు. మొక్కవోని దీక్ష, ధైర్యం, దూకుడు, పట్టుదల, తెలివితేటలతో అనితర సాధ్యమైన దానిని రాకేష్ సాధ్యమని నిరూపించారు.
రాకేష్ ఏ షేర్ కొంటే ఆ షేర్ ధర ఆకాశాన్నంటేది. రాకేష్ టిప్ ఇస్తే చాలు రిటైల్ ఇన్వెస్టర్లు ముందు వెనక చూడకుండా ఆ షేర్ ను కొనేస్తారు . ఎందుకంటే రాకేష్ ఎంపికపై ట్రేడ్ వర్గాలకు అంత నమ్మకం. హంగామా మీడియా, ఆప్టెక్ వంటి కంపెనీలకు చైర్మన్ గా కూడా రాకేష్ పని చేశారు. వైస్రాయ్ హోటల్స్ కు వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. కేవలం వ్యాపారవేత్తగానే కాదు దానధర్మాలలోనూ రాకేష్ బిగ్ బుల్ గా పేరుపొందాు. తన సంపాదనలో దాదాపు 25 శాతం ఛారిటీలకు ఖర్చు పెడుతుంటారు.
ఎకనమిస్టులు సూచించిన పొదుపు సూత్రాలను తాను పాటించి ఉంటే ఈ స్థాయికి ఎదిగే వాడిని కాదని రాకేష్ అంటుంటారు. రిస్క్ చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగా అంటుంటారు.