ఈబర్ బీజేపీ.. బెంగాల్ లో ఈ మాట ప్రతి చోట బలంగా వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ కోట మీద బీజేపీ జెండా ఎగురవేయాలన్న సమరోత్సాహం ఇప్పుడా పార్టీలో పెద్ద ఎత్తున కనిపిస్తోంది. దీనికి తగ్గట్లే.. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఫోకస్ అంతా పశ్చిమ బెంగాల్ మీదే పెట్టింది.
మిగిలిన చోట్ల ఫలితం ఎలా ఉన్నా.. బెంగాల్ లో అధికారంలోకి వస్తే.. తమ బలం అమితంగా పెరుగుతుందన్న విశ్వాసం కమలనాథుల్లో ఉంది. అందుకే.. వారు బెంగాల్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. పశ్చిమబెంగాల్ లో ఈసారి మమతా బెనర్జీ పార్టీకే గెలుపు ఖాయమని పలు అంచనాలు.. నివేదికలు చెబుతున్న వేళ.. బీజేపీ మరింత అలెర్టు అయ్యింది. ఏ చిన్న పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.
తాజాగా కేంద్ర హోం మంత్రి.. బీజేపీ కీలక నేత అమిత్ షా రోడ్ షోలో పాల్గొన్నారు. అంచనాలకు మించి జనం పోటెత్తటంతో.. ఈ కార్యక్రమానికి హాజరైన అమిత్ షా అమితానందానికి గురయ్యారు. ఖరగ్ పూర్ నుంచి బీజేపీ తరఫున నటుడు హిరణ్ చటర్జీ పోటీ చేస్తున్నారు. ఆయన తరఫున ప్రచారం చేసేందుకు రోడ్ షో లో పాల్గొనటానికి అమిత్ షా వచ్చారు.
బీజేపీ వర్గాలు ఏ మాత్రం ఊహించని రీతిలో వేలాది మంది ర్యాలీకి రావటం కమలనాథుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. కిలోమీటర్ దూరం ఉండే ర్యాలీ పూర్తి కావటానికి చాలా సమయం తీసుకోవటం గమనార్హం. ఇంత భారీగా జనసందోహం ర్యాలీకి హాజరు కావటంపై బీజేపీ నేతల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఈ ర్యాలీకి హాజరైన అమిత్ షాతో పాటు.. ఇతర బీజేపీ నేతల్లోనూ ఉత్సాహం వెల్లివిరిసింది. ఇప్పటివరకు వచ్చిన నివేదికలకు భిన్నంగా.. ప్రజలు పోటెత్తుతున్న బీజేపీ సభల్ని చూసినప్పుడు.. ఎన్నికల ఫలితం అంచనాలకు భిన్నంగా రానుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
అయితే, ఎన్నికల మేనేజ్ మెంట్ లో ఆరి తేరిన బీజేపీ… జనాల్లో హిస్టీరియా క్రియేట్ చేయడానికే జనసమీకరణ గట్టిగా చేసిందనే వాదన కూడా ఉంది.