వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గోరంట్ల వీడియో ఫేకా కాదా అన్న విషయం తేలేందుకు ఫోరెన్సిక్ టెస్ట్ కీలకం కానుందన్న సంగతి కూడా తెలిసిందే. దీంతో, ఈ రోజే విజయవాడలోని ఫోరెన్సిక్ ల్యాబ్ నకు ఆ వీడియో చేరిందని తెలిసిందే. అయితే, ఆ విషయం తెలియకుండా ఓ కోయిల తొందరపడి కూసింది. మాధవ్ వీడియో ఫేక్ అంటూ ఈ రోజు ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించేశారు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప. దీంతో, ఈ వ్యవహారంలో ఫకీరప్ప తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు.
దేన్ని ఆధారం చేసుకొని గోరంట్ల వీడియో ఫేక్ అని ఫకీరప్ప ప్రకటించారని లోకేష్ ప్రశ్నించారు. ఏ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిందో చూపించాలని నిలదీశారు. సజ్జల నాలుగు గోడల మధ్య జరిగిన వ్యవహారానికి ఇంత రచ్చ ఎందుకంటూ ఆ వీడియో నిజమేనని పరోక్షంగా సజ్జల ఒప్పుకున్నట్లేనని లోకేష్ అన్నారు. కానీ, ఎస్పీ ఫకీరప్ప మాత్రం అసలు ఆ వీడియో గోరంట్లది కాదని చెబుతున్నారని, అసలు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రాకుండానే ఎస్పీ ఫకీరప్ప అలా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఆయనేమైనా ఫోరెన్సిక్ నిపుణుడా అని లోకేష్ ఫైరయ్యారు.
అంబటి రాసలీలలు కూడా ఫేక్ అంటారా? మంత్రి అవంతి చేసింది కూడా ఫేక్ అంటారా అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. వీడియో రిలీజైనప్పటి నుంచి ఇప్పటివరకు ఫకీరప్ప ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతకుముందు, అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు అశ్లీల వీడియో మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని , ఈ వీడియో ఒరిజినల్ వీడియో కాదని స్పష్టం చేశారు. ఈ వీడియోపై ఎంపీ అభిమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 4వ తేదీన టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని తెలిపారు. తొలుత ఈ వీడియో ITDP Official అనే వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారన్నారు. దానికి కౌంటర్ గా లోకేష్ తాజా కామెంట్లు చేశారు.
మహిళలపై తప్పుగా ప్రవర్తించడం వైసిపి నేతలకు అలవాటుగా మారిందని లోకేష్ మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని అవమానించారని, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అరె ముండా అని అసెంబ్లీలో అంటే సీఎం ఎందుకు స్పందించలేదని, ఇన్ని రోజులు సీఎం ఏం పీకాడు అని లోకేష్ నిలదీశారు. నాకు మరో పెళ్ళి జరిగిందని.. సంతోష్ అనే కొడుకు ఉన్నాడని తప్పుడు ఆరోపణలు చేసారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు మా ఇంట్లో దురదృష్టకర ఘటన జరిగినా రాజకీయం చేశారని… కుప్పంలో చంద్రబాబు, మంగళగిరి తాను తప్పకుండా పోటీ చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.
Comments 1