మెగాస్టార్ చిరంజీవికి ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో అతడొకరు. కానీ.. అతనో విధి వంచితుడు. కాలపరీక్షలో ఓడి.. జీవితం ఏ క్షణంలోనైనా ముగుస్తుందన్న చేదు నిజాన్ని భరిస్తూ..ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాడు. అతడే మొగల్తూరుకు చెందిన నాగరాజు. చిన్నతనం నుంచి చిరంజీవికి వీరాభిమానిగా ఉన్న అతనికి తన ప్రాణం పోయే లోపు మెగాస్టార్ ను ఒకసారి స్వయంగా చూడాలని.. కలవాలన్నది అతని కోరిక.
అనుకున్నంతనే చిరంజీవిని కలవటం సాధ్యం కాదు కదా? కానీ.. చిరు మీద అతనికున్న అంతులేని అభిమానం ఆ అభిమాని గురించి.. అతడి కోరిక గురించి చిరుకు తెలిసింది. అతని గురించి తెలిసిన ఆయన చలించిపోయాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొగల్తూరు అభిమానికి కబురు పంపాడు. రెండు కిడ్నీలు చెడిపోయి.. తీవ్ర అస్వస్థతో ఉన్న నాగరాజును ఇంటికి పిలిచాడు. తాను ఆరాధించే చిరును చూసినంతనే నాగరాజు ముఖం వెలిగిపోయింది. తీవ్ర భావోద్వేగంతో ఆయన వద్దకు వెళ్లారు.
తన మీద చూపించే ఈ అభిమానానికి చలించిపోయిన చిరు.. నాగరాజును దగ్గరకు తీసుకొని మనసారా హత్తుకున్నారు. అప్యాయంగా పలుకరించారు. నాగరాజుతో పాటు ఆయన సతీమణి కూడా వచ్చారు. వారిద్దరు వెలిగిపోతున్న ముఖాలతో చిరును చూస్తుండిపోయారు. వారితో చిరంజీవి పలు విషయాలు మాట్లాడారు. వారి కుటుంబం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తన మాటలతో నాగరాజుకు.. ఆయన సతీమణికి ధైర్యం చెప్పారు. నాగరాజులో మానసిక స్థైర్యాన్ని నింపటమే కాదు.. ఆర్థిక సాయాన్ని అందించారు చిరంజీవి. దాదాపు గంటకు పైనే తన అభిమానితో చిరంజీవి గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చిరంజీవి మంచి మనసును ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. అతని మంచి మనసుకు ఇదోచిన్న ఉదాహరణ మాత్రమే అని పొగిడేస్తున్నారు. ఏమైనా.. అభిమాని కోసం తాను ఏమైనా చేస్తాననే చిరు మాటలకు తగ్గట్లే చేతలు ఉండటం నిజంగా అభినందనీయం. ఇదిలా ఉండే సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. దానికి సంబంధించిన ఫోటోల్ని పోస్టు చేశారు