ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఘనమైన చరిత్ర ఉంది. గతంలో అన్న వారసత్వాన్ని పుణికి పుచ్చుకు ని రాజకీయ అరంగేట్రం చేసిన మాగుంట్ల.. కాంగ్రెస్‌లో కీలకనాయకుడిగా ఎదిగారు. ఎంపీగా విజయం సాధించారు. ప్రకాశం జిల్లాలో తనకంటూ.. ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఎవరు ఏ పని అడిగినా చేసిపెట్టిన నాయకుడిగా మాస్కు దగ్గరయ్యారు.
మాగుంట సుబ్బరామరెడ్డి సోదరుడిగా … రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీనివాసులు రెడ్డి 1998, 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు నుంచి కాంగ్రెస్ టికెట్‌పై విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆయన ఒక హవా సృష్టించారు. తనకంటూ ప్రత్యేక రాజకీయాలు చేశారు.
ఇక, రాష్ట్ర విభజనతో ఆయన కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం అందినా.. `డామినే షన్`కు భయపడి.. టీడీపీవైపు అడుగులు వేశారు. అయితే.. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసినా.. పరాజయం పాల య్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
ఇంతగా టీడీపీ ఆదరించినా.. ఆయనకు, స్థా నిక టీడీపీ నేతలకు మధ్య పొసగలేదు. దీంతో టీడీపీలో ఉన్నప్పటికీ.. ముభావంగానే వ్యవహరించారు. ఇటు పార్టీ కోసం.. అటు తన కోసం కూడా ఆయన యాక్టివ్ కాలేక పోయారు. ఫలితంగా టీడీపీలో ఒంటరి నాయకుడిగా మిగిలిపోయారు. ఇది.. 2019 ఎన్నికల సమయానికి వైసీపీలోకి చేరేందుకు దారితీసింది.
2019 ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ టికెట్‌పై విజయం సాధించారు. అయితే.. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఉన్న స్వేచ్ఛ కూడా ఇప్పుడు మాగుంటకు లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీలో పేరుకే ఎంపీగా ఉన్నారని.. రెడ్డి సామాజిక వర్గమే అయినప్పటికీ.. గ్రూపు రాజకీయాల కారణంగా.. ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదని
మాగుంట అనుచరులే చెబుతుం డడం గమనార్హం. అదేసమయంలో ప్రభుత్వం నుంచి కూడా పనులు జరగడం లేదు. కనీసం ఎన్నికల్లో తనకు సహకరించిన వారికి కూడా ఆయన ఏమీ చేయలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం. దీంతో ఇప్పుడు మాగుంట రాజకీయం ఎవరికీ ఉపయోగం లేకుండా పోయిందని అంటున్నారు.
కాంట్రాక్టుల నుంచి వలంటీర్ వంటి చిన్నపాటి ఉద్యోగాల వరకు కూడా కొన్ని శక్తులు తనకు అడ్డు పుల్లలు వేస్తున్నాయనేది మాగుంట ఆవేదన. ఇటు బయటకు చెప్పుకోలేక .. అటు లోలోన మధన పడలేక ఆయన ఇబ్బంది పడుతున్నారని మాగుంట అనుచరులు పేర్కొంటున్నారు. మొత్తానికి పార్టీ మారి గెలిచినా.. ఫలితం దక్కలేదని అంటున్నారు.