2017లో బయటపడ్డ డ్రగ్స్ రాకెట్ వ్యవహారం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ రాకెట్లో కొంత మంది సినీ ప్రముఖుల పేర్లు బయటకు రావడం, వారు విచారణకు హాజరు కావడంపై మీడియాలో విస్తృతంగా కథనాలు ప్రసారమయ్యాయి. నాటి డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో తనీష్ పేరు కూడా వచ్చింది. అయితే, తనకు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం లేదని నాడు మీడియా ముందు తనీష్ ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, ఆ జాబితాలో తన పేరు చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. మీడియాలో తన పేరు రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఆ వ్యవహారం అలా ఉండగానే తాజాగా మరోసారి డ్రగ్స్ కేసులో తనీష్ పేరు మీడియాలో రావడం చర్చనీయాంశమైంది. బెంగుళూరు డ్రగ్స్ కేసుకు సంబంధించి తనీష్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది.
బెంగళూరుకు చెందిన ఓ బడా నిర్మాతకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చాయని, ఈ క్రమంలోనే ఆ నిర్మాతతో సంబంధం ఉన్న తనీష్ కు కూడా నోటీసులు వచ్చాయని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కథనాలపై తనీష్ స్పందించారు. తనకు డ్రగ్స్ కేసుతో సంబంధాలున్నాయంటూ ప్రసారమైన కథనాలను తనీష్ ఖండించారు. ఆ కథనాల్లో వాస్తవం లేదని వెల్లడించారు.
బెంగళూరు నిర్మాతకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చిన మాట నిజమేనని, అయితే, తనకు వచ్చిన నోటీసు అర్థం వేరని, అది తెలుసుకోకుండా ఇష్టానుసారం కొన్ని మీడియా సంస్థలు తనపై దుష్ప్రచారం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కథనాలు తనను, తన కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్రంగా బాధించాయని వాపోయారు. ఆ బెంగళూరు నిర్మాతతో రెండేళ్లుగా ఎలాంటి సంప్రదింపులు లేవని తెలిపారు.
ఆ కేసుకు సంబంధించిన ఫలానా వివరం మీకు తెలుసా.. తెలిస్తే చెప్పండి…అని అడిగేందుకు మాత్రమే ఆ నోటీసు ఇచ్చారని తనీష్ వివరణ ఇచ్చారు. అంతేగానీ, ఆ కేసులో తాను ఇన్వాల్వ్ అయ్యానని నోటీసులు పంపలేదని అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా దయచేసి ఇలాంటి అసత్య ప్రచారం చేయవద్దని తనీష్ చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు తనను సంప్రదించి న్యాయబద్ధంగా నిజాల్ని ప్రచురించాయని కూడా తనీష్ వివరణనిచ్చారు.