ప్రజల్లో చైతన్యం తీసుకువస్తానంటూ.. పార్టీ పెట్టిన జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇప్పటి వరకు చైతన్యం తీసుకురాలేక పోయారనే వాదన ఉండగా.. ఇటు పార్టీ పరంగా ఆయన వేస్తున్న అడుగులు కూడా నేతల కు ఏమాత్రం నచ్చకపోవడం గమనార్హం. ఇప్పటికే ఆయన వేసిన అడుగులు తప్పటడుగులా మారిపోయా యి. ఇక, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మరింతగా పార్టీ నేతలను ఇబ్బందిలోకి నెట్టేలా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. త్వరలోనే జరగనున్న తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికలకు సంబంధించి ఆది నుంచి కూడా గట్టి పట్టుతో ఉన్నారు పవన్.
ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ తాము పోటీ చేసితీరుతామని పవన్ ప్రకటించారు. అంతేకాదు. తెలంగాణలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము పోటీకి దూరంగా ఉన్నామని.. అదేసమయంలో తమ మిత్ర పక్షం బీజేపీతో చేతులు కలిపి.. ప్రచారం నిర్వహించి.. బీజేపీ బలపడేందుకు ప్రయత్నించామని.. ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తమకు తిరుపతి పార్లమెంటు స్థానాన్ని వదిలేయాలని ఆయన పట్టుబట్టారు. దీనికి సంబంధించి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో చర్చిస్తున్నామని అన్నారు. అయితే.. ఈలోగానే ఏపీ బీజేపీ అధ్యక్షుడు.. సోము వీర్రాజు.. ఇక్కడ బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించేశారు. దీనిపైజనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా ఎలా ప్రకటిస్తారని.. కేంద్రంలోని బీజేపీ నాయకులతో తమ నేత పవన్ చర్చలు జరుపుతున్న దశలో ఇలా ప్రకటించడం ఏమేరకు మంచిదని కూడా ప్రశ్నించిన వారు ఉన్నారు. అయితే.. ఇప్పుడు తిరుపతి పార్లమెంటు ఉప పోరులో బీజేపీనే రంగంలోకి దిగుతోందని.. తాము సహకరిస్తామని.. పవన్ ప్రకటించడం పార్టీ వర్గాలను నిరాశలో ముంచేసింది. తమ నాయకుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడలేక చాలా మంది నాయకులు.. పవన్ ప్రకటనను జీర్ణించుకోలేక పోతున్నారు. అంతేకాదు.. ఇప్పటికే ఏపీ బీజేపీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. ఈ సమయంలో ఆ పార్టీకి డిస్టెన్స్ మెయింటెన్ చేస్తే.. మంచిదని పార్టీ నేతలు సూచిస్తున్నారు.
కానీ..వీరి ఆలోచనను పక్కన పెట్టి మరీ.. అంతో ఇంతో గెలిచే అవకాశం లేదా పార్టీ పుంజుకునే అవకాశం ఉన్న తిరుపతి పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి కట్టబెట్టడం పార్టీని మరింతగా పలుచన చేస్తుందని అంటున్నారు పరిశీలకులు. గతంలో పవన్ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా కొందరు గుర్తుచేస్తున్నారు. “ఇక్కడ నుంచి మేమే పోటీ చేస్తాం. ఈ విషయంలో తేడా వస్తే.. ఒంటరిగా అయినా.. పోటీ చేసేలా ఆలోచన చేస్తున్నాం“ అని ఆయన వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు తానే స్వయంగా బీజేపీకి సీటును అప్పగించేయడం చర్చకు దారితీసింది.