ఆస్ట్రాలజర్ వేణు స్వామి…ఇరు తెలుగు రాష్ట్రాలలోని సినీ, రాజకీయ ప్రముఖులకు, ప్రజలకు ఈయన సుపరిచితుడే. సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత, టాలీవుడ్ హీరో నాగ చైతన్యల విడాకుల తర్వాత వేణు స్వామికి ఫేమ్ అండ్ నేమ్ వచ్చింది. ఎందుకంటే, వారిద్దరూ విడాకులు తీసుకుంటారని వేణు స్వామి విడాకులు తీసుకోవడానికి నాలుగేళ్ల ముందే చెప్పారు. దీంతో, గతంలో పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల గురించి వేణు స్వామి చెప్పిన విషయాలు, వాటిలో జరిగినవి, జరగనవి చర్చకు వచ్చాయి.
ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ నాలుగో పెళ్లి చేసుకుంటారని వేణు స్వామి షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు, పవన్ కల్యాణ్ తో పాటు మెగా స్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ జాతకాలు ఒకటేనని, వారిద్దరి జాతకాల్లో కుజుడు నీచంలో ఉన్నాడని వేణు స్వామి అన్నారు. దీంతో, శ్రీజ జీవితంలో మరో రెండు పెళ్లిలు జరగుతాయని కూడా జోస్యం చెప్పారు వేణు స్వామి.
కల్యాణ్ దేవ్ కు శ్రీజ బ్రేకప్ చెప్పిందని, త్వరలోనే మరొకరిని పెళ్లి చేసుకోబోతోందని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక, నయన తార.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ లు కూడా విడాకులు తీసుకుంటారని బాంబు పేల్చారు వేణు స్వామి. నయన తార జాతకంలో గురువు నీచంలో ఉన్నారని అందుకనే ఆమె వైవాహిక జీవితం అంత సవ్యంగా సాగదని అంటున్నారు. సమంతకు ఉన్నట్లే నయనతారకు గురువు నీచంలో ఉన్నారని, అలా ఉండటం వల్లనే సమంతకు అలా జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు వేణు స్వామి చెప్పిన వాటిలో కొన్ని జరగడంతో పవన్ నాలుగో పెళ్లికి ఇదే ప్రూఫ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.