సాధారణంగానే రాజకీయం అంటే రకరకాలుగా ఉంటుంది మాస్టారు..అవును అదేదో సినిమాలో బ్రహ్మీకి వచ్చిన కష్టాలే పాపం అధికారంలో ఉన్న నాయకులకూ వారి అనుచరులకూ వస్తూ ఉన్నాయి. ఆ విధంగా సీఎం జగన్ ను ఇరకాటంలో పడేసి మరీ ! మిగతా నాయకులు కొన్నంటే కొన్ని సార్లు చోద్యం చూస్తూ ఉన్నారు.
తాజాగా గోరంట్ల ఇష్యూలో కూడా ఇదే జరిగింది. సొంత మనుషులెవ్వరో, పరాయివారెవ్వరో తెలియని సందిగ్ధంలో ఉన్నారు వైసీపీ ఎంపీ. ఆ విధంగా ఆయన ఇరుకున పడి ఉండవచ్చు అని తెలుస్తోంది. ఇక ఇదే విషయమై టీడీపీ ర్యాగింగ్ మామూలుగా లేదు.పసుపు పార్టీ నాయకులు దొరికిందే తడవుగా కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. వీలున్నంత వరకూ వ్యంగ్యానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ రోజు జేసీని ఉద్దేశించి మీసం మెలేసిన ఎంపీ గోరంట్ల ఇప్పుడెందుకు సూటిగా మాట్లాడలేక, ఇతర మీడియా సంస్థలను తిట్టిపోస్తున్నారని టీడీపీ అంటోంది. గతంలో కూడా ఇలాంటివెన్నో వెలుగులోకి వచ్చినా వైసీపీ పట్టించుకోలేదు అని, ఇప్పుడు కూడా అదేవిధంగా నిర్లక్ష్యపు ధోరణిలోనే తప్పుకుని తిరుగుతుందని దుయ్యబడుతున్నారు కొందరు పసుపు పార్టీ నాయకులు.
తాజాగా బుద్ధా వెంకన్న స్పందించారు.యువజన శృంగార చిలిపి పార్టీ అంటూ వైఎస్సార్సీపీకి కొత్త అర్థం ఒకటి చెప్పి మళ్లీ ఆయన సంచలనం అయ్యారు.
మరోవైపు జనసేన కూడా ఎంపీ గోరంట్ల ఇష్యూపై స్పందిస్తోంది. ఇటువంటివి ప్రజా స్వామ్య దేశాన సహించరానివని,గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న అంబటి, అవంతి వంటి వారిపై పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలే లేవని వైసీపీ అధినాయకత్వాన్ని ఉద్దేశించి మండి పడుతోంది. అదేవిధంగా ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పట్టుబడుతోంది. ఓ ఎంపీ అయి ఉండి ప్రజా సమస్యలపై స్పందించాల్సింది పోయి ఈ విధంగా ప్రవర్తించడం ఏమీ బాలేదని
మహాసేన రాజేశ్ అంటున్నారు. తప్పు చేసిన వారిని ఏమీ అనకుండా ఆ తప్పును వెలుగులోకి తెచ్చిన ఓ ప్రముఖ ఛానెల్ సీఈఓను తిట్టిపోయడం సబబుగా లేదని అంటున్నారాయన. ఈ నేపథ్యంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఇష్యూ తెలుగు రాష్ట్రాలలో తీవ్ర చర్చకు తావిస్తోంది. వీలున్నంత వరకూ బాధ్యులపై శిక్షలు వేయడం మానుకుని, ఆ విషయం పై మాట్లాడిన వారిని వైసీపీ నాయకులు అనరాని మాటలూ అంటున్నారు అని ఇదెక్కడి న్యాయమని మండిపడుతున్నారు విపక్ష నాయకులు. వాస్తవానికి ఎంపీ మాధవ్ ఇప్పుడే ఈ విధంగా ప్రవర్తిస్తే పోలీసు శాఖలో పనిచేసే రోజుల్లో ఇంకెందరిని వేధించారో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదేమయినప్పటికీ గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవాన్ని కాపాడుకునే పనులు మాత్రమే చేయాలి. గతంలో కూడా అగౌరవనీయ స్థాయిలో, అతి జుగుప్సాకర పద్ధతిలో కొన్ని మాటలు వినిపించిన దాఖలాలు అనేకం వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అప్పుడు కూడా పార్టీ అధిష్టానం బాధ్యులపై చర్యలు ఎందుకనో వెంటవెంటనే తీసుకోలేకపోయింది. దీంతో వీరి విషయమై అసెంబ్లీ వేదికగా కూడా కొంత చర్చ నడిచింది. అయినా కూడా సంబంధిత
నాయకులు అస్సలస్సలు వెనక్కు తగ్గలేదు. తాజాగా ఎంపీని సస్పెండ్ చే యాలన్న డిమాండ్ ఉన్నా వైసీపీ బాస్ మాత్రం ఆ సాహసం చేయకూడదనే అనుకుంటున్నారని తెలుస్తోంది.